Telugu Global
National

హిందువులు తమ ఇళ్ళను ముస్లింలకు అమ్మొద్దు -ఢిల్లీలో రెచ్చగొట్టే పోస్టర్లు

ఇళ్ళు అమ్మితే హిందువులకు మాత్రమే అమ్మాలని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ పోస్టర్‌పై బ్రహ్మపురిలోని స్ట్రీట్ నంబర్ 13కి చెందిన న్యాయవాది ప్రదీప్ శర్మ పేరు ఉంది.

హిందువులు తమ ఇళ్ళను ముస్లింలకు అమ్మొద్దు -ఢిల్లీలో రెచ్చగొట్టే పోస్టర్లు
X

ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో ఉన్న బ్రహ్మపురి నివాసితులు తమ ఇళ్లను ముస్లిం కొనుగోలుదారులకు విక్రయించవద్దని ఆ ప్రాంతంలోని హిందూ ఇళ్ళ యజమానులకు పిలుపునిస్తూ పోస్టర్లు అంటించారు.ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. వైరల్ గా మారాయి. బ్రహ్మపురి స్ట్రీట్ నం.13లో అతికించిన పోస్టర్ల‌లో అటువంటి విక్రయాలకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ ను అనుమతించబోమని, ఎలాంటి సమస్యలు తలెత్తినా యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇళ్ళు అమ్మితే హిందువులకు మాత్రమే అమ్మాలని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. ఈ పోస్టర్‌పై బ్రహ్మపురిలోని స్ట్రీట్ నంబర్ 13కి చెందిన న్యాయవాది ప్రదీప్ శర్మ పేరు ఉంది.

ఈ విషయంపై ఓ ప్రముఖ వెబ్ సైట్ స్థానిక నివాసితులతో మాట్లాడినప్పుడు, వారు ఈ విషయంపై చర్చించడానికి వెనుకాడారు.

స్ట్రీట్ నెం. 13కి చెందిన స్థానిక నివాసి ఒకరు మాట్లాడుతూ, "రెండు రోజుల క్రితం వీధిలో పోస్టర్లు కనిపించాయి. వీధిలోని మతీన్ మసీదు ఇమామ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉస్మాన్‌పూర్ పోలీసుల నుండి స్టేషన్ హెడ్, ఎసిపి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ప్రదీప్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. అని చెప్పారు.అయితే మరికొందరు మాత్రం ప్రదీప్ శర్మ పరారీలో ఉన్నాడని చెప్తున్నారు.

మరొక స్థానికుడు చెప్పిన దాని ప్రకారం, వీధిలో హిందువులు, ముస్లింలు రెండు మతాల వారున్నారు. , ఇరు వర్గాల వారు శర్మపై సంయుక్తంగా ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగించారు. కొంతమంది నివాసితుల చెప్తున్న దాని ప్రకారం, తనపై కుట్ర జరిగిందని శర్మ చెప్పాడని, , తనకు తెలియకుండా తన‌ సమ్మతి లేకుండా పోస్టర్‌లో తన పేరును ఉపయోగించారని శర్మ పేర్కొన్నాడని వారు చెప్పారు. . ఈ విషయంపై ఆ వెబ్ సైట్ తో ఉస్మాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్‌ఐ రామర్ మాట్లాడుతూ, ఇలాంటి పోస్టర్‌లు వేయడంపై తమకు ఫిర్యాదు అందిందని, అయితే, తమ పోలీసు స్టేషన్ హెడ్, ఎసిపి, తమ బృందంతో పాటు వీధి నంబర్ 13కి చేరుకున్నప్పుడు అక్కడ అలాంటి పోస్టర్లు ఏవీ కనిపించలేదని చెప్పారు.

2020లో ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో జరిగిన మతపరమైన అల్లర్లలో ఈ బ్రహ్మపురి ప్రాంతం ప్రభావితం కాలేదు, కానీ పక్కనే ఉన్న చౌహాన్ బంగర్, జఫ్రాబాద్, భజన్‌పురా వంటి ప్రాంతాలు గణనీయమైన హింసను చవిచూశాయి. అప్పటి నుండి ఈ ప్రాంతాల్లోని ప్రజలు చాలా భయాందోళనలతో జీవిస్తున్నారు. వాటి పక్కనే బ్రహ్మపురి ఉండటం, ఆ ప్రాంతంలో ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనిమివ్వడం ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇప్పటికే వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. స్థానికులు స్వేచ్ఛగా మాట్లాడటానికి ఇష్టపడరు.

First Published:  14 Jan 2023 1:56 PM GMT
Next Story