Telugu Global
National

అది బాబర్ రోడ్ కాదు.. వాల్మీకి మార్గ్..!!

దేశ రాజధాని ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలో బాబర్ రోడ్ ఉంది. ఆ పేరుకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ పేరు తీసేసి భగవాన్ వాల్మీకి మార్గ్ అనే పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు హిందూ సేన నాయకులు.

అది బాబర్ రోడ్ కాదు.. వాల్మీకి మార్గ్..!!
X

రాజ్ పథ్ పేరుని కర్తవ్య్ పథ్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత భారత్ లో పేరు మార్పు వ్యవహారాలు మరింత హైలెట్ అవుతున్నాయి. రాజ్‌ధాని ఎక్స్ ప్రెస్ పేరుని కర్తవ్య్ ధానిగా మార్చాలని, రాజ్ భవన్ లను కర్తవ్య భవన్ లుగా మార్చాలంటూ బీజేపీపై కాంగ్రెస్, టీఎంసీ నేతలు సెటైర్లు వేశారు. ఈ జోక్ ఇప్పుడు నిజం కాబోతోంది. కాంగ్రెస్ నేతలు సరదాగా అన్నా.. ఇతర వర్గాలు కొన్ని పేర్లను సీరియస్ గా తీసుకున్నాయి. ఎలాగూ పేర్లు మారుస్తున్నారు కాబట్టి.. మా మనోభావాలను కూడా గౌరవించండి అంటూ కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.

బాబర్ మార్గ్ పేరు మార్చేయండి..

దేశ రాజధాని ఢిల్లీలోని బెంగాలీ మార్కెట్ ప్రాంతంలో బాబర్ రోడ్ ఉంది. ఆ పేరుకి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. బాబర్ ఓ ఆక్రమణదారుడని, భారత్ పై ఆయన దండెత్తి వచ్చారని, హిందువుల మత మార్పిడికి పాల్పడ్డారని.. అలాంటి వ్యక్తి పేరుతో రోడ్డు ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు హిందూ సేన నాయకులు. ఆ పేరు తీసేసి భగవాన్ వాల్మీకి మార్గ్ అనే పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కి హిందూ సేన ఈమేరకు ఓ లేఖ రాసింది. బాబర్ రోడ్ ని భగవాన్ వాల్మీకి మార్గ్ గా మార్చాలని కోరింది.

అయోధ్యలో శ్రీరామ మందిరంపై సుప్రీంకోర్టు తీర్పుతో బాబర్ ఆక్రమణదారుడని, శ్రీరామ మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించాడని రుజువైందని లాజిక్ తీస్తున్నారు హిందూ సేన నాయకులు. ఢిల్లీలోని బాబర్ రోడ్డు బాబర్ క్రూరత్వాన్ని గుర్తు చేస్తుందని అంటున్నారు. వాల్మీకి రామాయణం రూపంలో శ్రీరాముడి గురించి ప్రపంచానికి చాటిచెప్పిన మహానుభావుడు కాబట్టి, బాబర్ పేరు తీసేసి వాల్మీకి పేరు పెట్టాలన్నారు. గతంలో కూడా వివిధ హిందూ సంఘాలు బాబర్ రోడ్డుకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరో పేరు సూచిస్తూ హిందూ సేన ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కి లేఖ రాసింది. ప్రజలు బాబర్ రోడ్డులో వెళ్తున్నప్పుడు, అది హిందువులపై బాబర్ చేసిన అకృత్యాలను గుర్తు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  16 Sep 2022 6:41 AM GMT
Next Story