Telugu Global
National

'హిందూ దేశం' రాజ్యాంగ ముసాయిదా సిద్దం... ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ‌

కొందరు పీఠాధిపతులు, సాదువులు, హిందుత్వ మేదావులు కలిసి భారత్ ను హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగ ముసాయిదాను సిద్దం చేశారు. ఢిల్లీకి బదులు వారణాసిని దేశ‌ రాజధానిగా డిసైడ్ చేసిన ఆ బృందం ముస్లిం, క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కును నిరాకరించింది.

హిందూ దేశం రాజ్యాంగ ముసాయిదా సిద్దం... ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ‌
X


భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి కావాల్సిన రాజ్యాంగం సిద్దమయ్యింది. 30 మంది ప్రముఖ, సాధువులు, మేధావులు, ప్రొఫెసర్స్ , పరిశోధకులు ఈ రాజ్యాంగాన్ని సిద్దం చేశారు. ఇప్పుడు ఈ రాజ్యాంగం ముసాయిదాను శాంభవి పీఠాధీశ్వరుడి ఆధ్వర్యంలో 30 మందితో కూడిన బృందం తుదిమెరుగులు దిద్దుతోందని వారణాసికి చెందిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద్ స్వరూప్ తెలిపారు.

750 పేజీల ముసాయిదాను సిద్ధం చేసే బృందంలో స్వరూప్ తో పాటు హిందూ రాష్ట్ర నిర్మాణ సమితి చీఫ్ కమలేశ్వర్ ఉపాధ్యాయ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది బిఎన్ రెడ్డి, రక్షణ రంగ నిపుణుడు ఆనంద్ వర్ధన్, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, ప్రపంచ హిందూ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ తదితరులు ఉన్నారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ప్రయాగ్ రాజ్ లో జరిగిన ధర్మసంసద్ లో దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని తీర్మానం చేశారు. ఆ మేరకు అందుకు తగ్గ రాజ్యాంగం ముసాయిదా తయారు చేస్తున్నారు. 2023 లో జరిగే ధర్మ సంసద్ లో ఈ రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తారు.

"రాజ్యాంగం 750 పేజీలతో ఉంటుంది. దాని వివరాలను విస్తృతంగా చర్చిస్తున్నాం. ధార్మిక పండితులు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. దీని ఆధారంగా, ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మాఘమేళా-2023లో సగం రాజ్యాంగం (సుమారు 300 పేజీలు) విడుదల చేస్తాము."అని స్వరూప్ తెలిపారు.

విద్య, రక్షణ, శాంతిభద్రతలు, ఓటింగ్ విధానం, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఇప్పటి వరకు 32 పేజీలు సిద్ధం చేశామన్నారు.

"ఈ హిందూ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం, ఢిల్లీకి బదులుగా వారణాసి దేశ రాజధానిగా ఉంటుంది. అంతేకాకుండా, కాశీ (వారణాసి)లో 'మతాల పార్లమెంటు' నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది" అని స్వరూప్ తెలిపారు.

ఈ ముసాయిదా కవర్ పేజీపై 'అఖండ భారత్' మ్యాప్‌ ఉంది. ఆ అఖండ భారత్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాలున్నాయి. ''ఏదో ఒక రోజు ఆ దేశాలు మన దేశంలో విలీనం అవుతాయి" అని స్వరూప్ అన్నారు.

ఈ పత్రంపై స్వరూప్ మాట్లాడుతూ, ప్రతి కులానికి చెందిన ప్రజలు దేశంలో నివసించే సౌకర్యం ఉంటుందని అలాగే అందరికి భద్రత లభిస్తుందని, అయితే ఇతర మత విశ్వాసాల ప్రజలను ఓటు వేయడానికి అనుమతించరని అన్నారు.

"హిందూ రాష్ట్ర రాజ్యాంగ ముసాయిదా ప్రకారం, ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు ఉండదు కానీ ఒక సాధారణ పౌరునికుండే అన్ని హక్కులూ ఉంటాయి. వారు తమ వ్యాపారాలు చేయడానికి, విద్యా, ఉపాధిని పొందడానికి అందరితో సమానంగా అన్ని సౌకర్యాలు పొందుతారు." అని స్వరూప్ చెప్పారు.

అయితే హిందువులతో పాటు సిక్కులు, బౌద్ధులు, జైనులకు కూడా ఓటు హక్కు ఉంటుంది.

స్వరూప్ ప్రకారం, ఎన్నికలలో పోటీ చేసే వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది, 16 సంవత్సరాలు నిండిన తర్వాత పౌరులు ఓటు హక్కును పొందుతారు. మొత్తం 543 మంది సభ్యులు 'మతాల పార్లమెంటు' కోసం ఎన్నుకోబడతారు, కొత్త వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి నియమాలు, నిబంధనలను రద్దు చేస్తుందని, ప్రతిదీ 'వర్ణ' వ్యవస్థ ఆధారంగా నిర్వహించబడుతుందని చెప్పారు.

త్రేతా, ద్వాపర యుగాల శిక్షా విధానంపై న్యాయవ్యవస్థ ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

"గురుకుల వ్యవస్థ పునరుద్ధరణ చేయబడుతుంది. ఆయుర్వేదం, గణితం, నక్షత్రం, భూ-గర్భ, జ్యోతిష్యం మొదలైన వాటిలో విద్య అందించబడుతుంది," అన్నారాయన.

అంతేకాకుండా, ప్రతి పౌరుడు తప్పనిసరి సైనిక శిక్షణ పొందుతారని, వ్యవసాయాన్ని పూర్తిగా పన్ను రహితంగా చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ భవిష్యత్తు భారతమని ఈ హిందుత్వ పండితులు చెప్తున్నారు. అనేక హింసలు, దోపిడితో కూడిన వర్ణ వ్యవస్థను మళ్ళీ ప్రవేశపెట్టడానికి, కుల ఆధార శిక్షలతో కూడిన న్యాయవ్యవస్థను తేవడానికి తహతహలాడుతున్న ఈ పండితులకు ఇప్పుడున్న పాలకులు సహకరిస్తారనే నమ్మకం కూడా గాఢంగా ఉంది. తామంతా ఒకే తాను ముక్కలమని వాళ్ళ భావన. మధ్యయుగాల నాటి అంధకార, హింసాయుత కాలంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్న ఈ హిందుత్వ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు అంగీకరిస్తారా తిరస్కరిస్తారా ?

First Published:  16 Aug 2022 10:15 AM GMT
Next Story