Telugu Global
National

అదానీ బెదిరింపులకు బెదరం- హిండెన్‌బర్గ్

అదానీకి ఆసక్తి ఉంటే తమపై అమెరికాలోనూ కేసు వేయవచ్చని ఆహ్వానించింది. తమ దగ్గర అనేక డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటితో న్యాయపరమైన చర్యల్ని ఎదుర్కొంటామని ఆ సంస్థ చెబుతోంది.

అదానీ బెదిరింపులకు బెదరం- హిండెన్‌బర్గ్
X

అదానీ కంపెనీపై సంచలన ఆరోపణలతో నివేదిక విడుదల చేసిన అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ సంస్థ కీలక ప్రకటన చేసింది. నివేదిక విడుదల చేసిన సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ హెచ్చరికల నేపథ్యంలో.. తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ ప్రకటించింది.

కేవలం కుట్రపూరితంగానే ఈ రిపోర్టు ఉందని అదానీ గ్రూప్ పబ్లిక్ ఇష్యూని దెబ్బ కొట్టేందుకే రిపోర్టును విడుదల చేశారని హిండెన్‌బర్గ్‌ సంస్థపై అటు అమెరికాలో, ఇటు ఇండియాలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా అదానీ గ్రూప్‌ హెచ్చరించింది. అయితే అదానీ కంపెనీ హెచ్చరికల్ని హిండెన్‌బర్గ్‌ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ పై తాము 88 సూటి ప్రశ్నలు సంధించామని వాటికి మాత్రం అదానీ గ్రూప్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయిందని హిండెన్‌బర్గ్‌ ఎత్తి చూపింది.

అదానీకి ఆసక్తి ఉంటే తమపై అమెరికాలోనూ కేసు వేయవచ్చని ఆహ్వానించింది. తమ దగ్గర అనేక డాక్యుమెంట్లు ఉన్నాయని, వాటితో న్యాయపరమైన చర్యల్ని ఎదుర్కొంటామని ఆ సంస్థ చెబుతోంది. హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూపులో జరుగుతున్న వ్యవహారాలపై మంగళవారం ఒక సంచలన రిపోర్టును విడుదల చేసింది. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా లెక్కల తారుమారు, మార్కెట్లో మాయాజాలంతో ముందుకెళ్తుందని ఆరోపించింది. స్టాక్ మార్కెట్లో మాయాజాలం చేస్తూ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుతూ.. ఆ పెరిగిన షేర్ల విలువను చూపెడుతూ భారీగా అప్పులు తెస్తూ ఆ కంపెనీలను నడుపుతున్నారని రిపోర్ట్ ఆరోపించింది.

అదానీ గ్రూపులో పెట్టుబడులు పెట్టేవారు ఎప్పటికైనా భారీగా నష్టపోతారని హెచ్చరించింది. అదానీ కుటుంబ సభ్యుల గత నేర చరిత్రను తన రిపోర్ట్ లో ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దాంతో అదానీ గ్రూప్ ఈ నివేదికపై కారాలు మిరియాలు నూరుతోంది.

First Published:  27 Jan 2023 2:40 AM GMT
Next Story