Telugu Global
National

జర్నలిస్టులకు 'క్యారెక్టర్ సర్టిఫికెట్' నిబంధనపై దిగొచ్చిన హిమాచల్ పోలీసులు

హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందు ఈ విషయంపై క్షమాపణలు చెప్పారు. ప్రధాని పర్యటన కవరేజికి అందరూ జర్నలిస్టులను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు.

జర్నలిస్టులకు క్యారెక్టర్ సర్టిఫికెట్ నిబంధనపై దిగొచ్చిన హిమాచల్ పోలీసులు
X

ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 5న హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్కడి ఎయిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించడంతో పాటు బహిరంగ సభలో కూడా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కవరేజ్ చేయడానికి వచ్చే జర్నలిస్టులు తప్పని సరిగా 'క్యారెక్టర్ వెరిఫికేషన్ సర్టిఫికెట్' సబ్మిట్ చేయాలని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేవలం ప్రైవేట్ టీవీ చానల్స్, ప్రింట్ మీడియా జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ రంగంలోని దూరదర్శన్, ఆలిండియా రేడియో విలేకరులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని, అక్టోబర్ 1లోగా అందరూ ఈ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి పాసులు తీసుకోవాలని అందులో కోరారు.

ఇలా లెటర్ జారీ చేయడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిబంధన లేదని.. హిమాచల్‌ప్రదేశ్ పోలీసులే విచిత్రమైన నిబంధన పెట్టారని భగ్గుమన్నారు. ఇది కచ్చితంగా జర్నలిస్టులను అవమానించడమే అని మండిపడ్డారు. గతంలో కూడా ప్రధాని మోడీ హిమాచల్‌లో పర్యటించారని.. అప్పుడు లేని నిబంధన ఇప్పుడే ఎందుకు అవసరం వచ్చిందని వాళ్లు ప్రశ్నించారు. ఇలా అయితే ఎవరూ కవరేజీకి రాము అని తెల్చి చెప్పారు. ఇది తీవ్ర వివాదంగా మారుతుండటాన్ని గ్రహించిన హిమాచల్ ప్రదేశ్ పోలీసులు దిగి వచ్చారు.

జర్నలిస్టులను క్యారెక్టర్ సర్టిఫికెట్ అడుగుతూ లేఖ జారీ చేయడంపై క్షమాపణలు కోరింది. ఇది అనుకోకుండా జరిగిన త‌ప్పిద‌మ‌ని హిమాచల్ పోలీసులు తెలిపారు. ఆ లేఖను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నామని.. మీడియా ప్రతినిధులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని మరో లెటర్ జారీ చేశారు. పబ్లిక్ రిలేషన్ డిపార్ట్‌మెంట్ రికమెండ్ చేసిన అందరికీ పాసులు జారీ చేస్తామని, విలేకరులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ కూడా ఇచ్చారు.

హిమాచల్‌ప్రదేశ్ డీజీపీ సంజయ్ కుందు కూడా ఈ విషయంపై క్షమాపణలు చెప్పారు. ప్రధాని పర్యటన కవరేజికి అందరూ జర్నలిస్టులను ఆహ్వానిస్తున్నామని స్పష్టం చేశారు. తమ కార్యాలయం అనుకోకుండా సదరు లేఖను జారీ చేసిందని పేర్కొన్నారు.

First Published:  4 Oct 2022 9:42 AM GMT
Next Story