Telugu Global
National

ప్రధాని మోడీ ఫోన్ చేసినా నామినేషన్ ఉపసంహరించుకోని రెబల్ క్యాండిడేట్

ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా క్రిపాల్‌కు కాల్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. క్రిపాల్ మాత్రం పంతం వీడలేదు.

ప్రధాని మోడీ ఫోన్ చేసినా నామినేషన్ ఉపసంహరించుకోని రెబల్ క్యాండిడేట్
X

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి తల నొప్పులు తెస్తోంది. టికెట్లు ఆశించిన చాలా మందికి అధిష్టానం హ్యండ్ ఇవ్వడంతో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. కొంత మంది ఏకంగా రెబెల్ క్యాండిడేట్లుగా నామినేషన్లు వేస్తున్నారు. అంతిమంగా ఇది పార్టీకి పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలోని ఫతేపూర్ నియోజకవర్గం నుంచి క్రిపాల్ పర్మార్ బీజేపీ టికెట్ ఆశించారు. కానీ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించకపోవడంతో రెబెల్ క్యాండిడేట్‌గా నామినేషన్ వేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ ఆయనను బుజ్జగించే పనిలో పడింది. కానీ, క్రిపాల్ మాత్రం తన నామినేషన్ ఉపసంహరించుకోలేదు.

ప్రధాని నరేంద్ర మోడీ ఏకంగా క్రిపాల్‌కు కాల్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. క్రిపాల్ మాత్రం పంతం వీడలేదు. ప్రధాని ఫోన్ చేసినా నామినేషన్ ఉపసంహరించుకోని విషయం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది ఫతేపూర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చిన సమయంలో కూడా క్రిపాల్ పార్టీ టికెట్ వస్తుందని అనుకున్నారు. కానీ బీజేపీ ఆయనకు మొండి చెయ్యి చూపించింది. అప్పటి నుంచి ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానే తనకు టికెట్ రాకుండా చేశారని క్రిపాల్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నడ్డా, క్రిపాల్ క్లాస్‌మేట్స్ కావడం గమనార్హం. గత 15 ఏళ్లుగా నడ్డా తనను అడ్డుకుంటున్నారని, అనేక మార్లు తనను అవమానించేలా ప్రవర్తించారని క్రిపాల్ ఆరోపిస్తున్నారు. నేను బరిలోనే ఉంటాను. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాను అని క్రిపాల్ ప్రకటించారు. నాకు బీజేపీ అభ్యర్థితో ఎలాంటి వైరం లేదని, తన పోటీ కాంగ్రెస్ అభ్యర్థితోనే అని క్రిపాల్ అంటున్నారు.

కేవలం నడ్డా మాత్రమే కాకుండా ప్రధాని మోడీ కూడా గత 15 ఏళ్లుగా తనను పక్కన పెట్టారని మండిపడ్డారు. తన రాజకీయ భవిష్యత్ మొత్తం మోడీ, నడ్డా వల్లే పాడైపోయిందని ఆరోపించారు. తనకు మోడీతో 25 ఏళ్లుగా పరిచయం ఉందని.. ఒకప్పుడు అతడిని దేవుడిలా భావించానని క్రిపాల్ చెబుతున్నారు. అంత గౌరవం ఇచ్చినా.. తనను మాత్రం పార్టీలో సైడ్ లైన్ చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు రెబెల్ క్యాండిడేట్‌గా బరిలో దిగుతున్నానని చెప్పుకొచ్చారు.

First Published:  9 Nov 2022 7:07 AM GMT
Next Story