Telugu Global
National

హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు.. ఇవి చాలవా ఎన్నికలకు..

హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు.. ఈ మూడే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్దామని సెలవిచ్చారు ఓ నేత. భేష్ భేష్ అంటూ మిగతా వాళ్లు బల్లలు చరిచారు. ఇంకేముంది కర్నాటకలో వచ్చే ఏడాది ఎన్నికలకు బీజేపీ అజెండా రెడీ అయింది.

హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు.. ఇవి చాలవా ఎన్నికలకు..
X

కర్నాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే సందిగ్ధంలో పడింది. వ్యూహాలు సిద్ధం చేయాలంటూ నేతల్ని ఆదేశించింది. దీంతో ఇటీవల ఓ మేథోమధ‌నం జరిగింది. బీజేపీ నేతలు అంతర్గత మీటింగ్ పెట్టుకున్నారు. ఏం చేశాం, ఏం చేయాలి, ఏం చేస్తే జనం ఓట్లు వేస్తారనే విషయంపై కూలంకషంగా చర్చించారు. ఫలితం శూన్యం. జేడీఎస్-కాంగ్రెస్ కూటమిని చెదరగొట్టి మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందనే విషయం వారి నోటి వెంటే వచ్చింది. అధికారం కోసం కొట్టుకున్నారు, ముఖ్యమంత్రుల్ని మార్చారు, కానీ ఫలితం లేకపోయింది. అభివృద్ధి పనులు ముందుకు సాగకపోగా, యడ్యూరప్ప హయాంలో జరిగిన అవినీతి బీజేపీకి మరకలా మారింది. ఇటీవల వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం మరోసారి విఫలమైంది. బెంగళూరుకి ఐటీ కళ తప్పింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని డిసైడ్ అయ్యారు కమలనాథులు.

కానీ ఏదో చేయాలి, ఏంచేయాలి..? ఇక్కడే వారి దుర్మార్గ ఆలోచనలు బయటపడ్డాయి. హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్లు.. ఈ మూడే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్దామని సెలవిచ్చారు ఓ నేత. భేష్ భేష్ అంటూ మిగతా వాళ్లు బల్లలు చరిచారు. ఇంకేముంది కర్నాటకలో వచ్చే ఏడాది ఎన్నికలకు బీజేపీ అజెండా రెడీ అయింది. మత విద్వేషాలే ప్రధాన అంశంగా బీజేపీ అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటోంది.

ప్లాన్-బి ఇదే..

సహజంగా ఎన్నికల సమయంలో అభివృద్ధి, సంక్షేమం ప్లాన్-ఏ అనుకోవాలి. అదే సమయంలో విధ్వంసం, రెచ్చగొట్టడం, విద్వేషాలు సృష్టించి సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకోవడం ప్లాన్- బి కిందకు వస్తాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్లాన్-బి తోనే తమకు లబ్ధి చేకూరుతోందని, కర్నాటకలో కూడా ప్లాన్-బి ని అమలు చేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే హిజాబ్ వివాదంతో సమాజం రెండు వర్గాలుగా చీలిపోయింది. హిజాబ్ పై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరి ఏంటో స్పష్టం చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్ట్ లో ఉన్నా కూడా ఇప్పుడు హిజాబ్ వివాదాన్ని మరోసారి ఎన్నికల సందర్భంగా తెరపైకి తేవాలనుకుంటున్నారు కమలనాథులు. ఇక హలాల్‌పై ఉద్యమం కూడా ఆమధ్య కర్నాటకలో మొదలైంది. పరోక్షంగా ప్రభుత్వం ఈ ఉద్యమానికి మద్దతు తెలిపింది. హలాల్ మన సంస్కృతి కాదంటున్నారు కర్నాటక బీజేపీ నేతలు. మూడోది మసీదుల వద్ద లౌడ్ స్పీకర్లు. మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్లు నిషేధించాలంటూ ఆమధ్య కర్నాటక ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత హిందూ ఆలయాల వద్ద కూడా మైక్ లు కట్ చేయాలనే ఒత్తిడులు కూడా వచ్చాయి. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంది. ఈ మూడు వ్యవహారాలను వచ్చే ఎన్నికలనాటికి మరోసారి రెచ్చగొట్టి, పబ్బం గడుపుకోవాలనుకుంటోంది బీజేపీ. మరి కర్నాటక వాసులు ఈసారి ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి.

First Published:  17 Sep 2022 2:56 AM GMT
Next Story