Telugu Global
National

బ్రహ్మాస్త్రం చెత్త సినిమా అయితే ఇన్ని కలెక్షన్స్ వస్తాయా? విమర్శలపై ఆలియాభట్ కౌంటర్

బ్రహ్మాస్త్రం సినిమాపై వచ్చిన విమర్శలపై ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ తాజాగా స్పందించింది. 'బ్రహ్మాస్త్రం నిజంగా చెత్త సినిమా అయితే అది రూ.150 కోట్ల మార్కును అందుకునేది కాదు.

బ్రహ్మాస్త్రం చెత్త సినిమా అయితే ఇన్ని కలెక్షన్స్ వస్తాయా? విమర్శలపై ఆలియాభట్ కౌంటర్
X

బాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్రం. ఈ సినిమాలో రణబీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 9వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా గ్రాండియర్ గా ఉన్నప్పటికీ, గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ సరైన కథాకథనాలు లేవనే విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ లో మరో ఫ్లాప్ మూవీగా నిలిచిన చిత్రం బ్రహ్మాస్త్రం అని విమర్శకులు తేల్చారు.

ఇక వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ ఈ సినిమా పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 400 కోట్లను బూడిదలో పోసిన పన్నీరులా చేశాడని మండిపడ్డారు. ఈ సినిమా కోసం 12 సంవత్సరాలుగా పలు విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ పని చేశారని..వారి శ్రమను వృథా చేశారని విమర్శించారు.

అయితే బ్రహ్మాస్త్రం సినిమా రివ్యూలకు భిన్నంగా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 125 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ లో మరే సినిమా ఇంత తక్కువ వ్యవధిలో అంత వసూళ్లు సాధించలేదు. బాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన సూపర్ హిట్ సినిమా భూల్ భూలయ్యా-2 జీవితకాల కలెక్షన్లను బ్రహ్మాస్త్రం మూవీ ఇప్పటికే అధిగమించింది. ది కాశ్మీర్ ఫైల్స్ హిందీలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలబడగా.. ఈ సినిమా తర్వాత స్థానంలో బ్రహ్మాస్త్రం నిలిచిందని.. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కాడెల్ ట్విటర్లో షేర్ చేశారు.

ఈ నేపథ్యంలో బ్రహ్మాస్త్రం సినిమాపై వచ్చిన విమర్శలపై ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ తాజాగా స్పందించింది. 'బ్రహ్మాస్త్రం నిజంగా చెత్త సినిమా అయితే అది రూ.150 కోట్ల మార్కును అందుకునేది కాదు. ఆ వసూళ్లే సినిమా ఎలా ఉంది అన్నది చెబుతున్నాయి. ఈ సినిమాపై వస్తున్న విమర్శలను పట్టించుకోకూడదు..అని చిత్రబృందం ముందే నిర్ణయించుకుంది.

అందుకే వాటి గురించి మేమెప్పుడూ ఆలోచించలేదు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో తప్పులేదు. అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది.బ్రహ్మాస్త్రం చెత్త సినిమా అని అంటున్న వారికి.. ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లే సమాధానం' అని ఆలియాభట్ పేర్కొంది. కాగా బ్రహ్మాస్త్రం సినిమాపై కంగనారనౌత్ తీవ్ర విమర్శలు చేయగా.. దానికి కౌంటర్ గానే ఆలియాభట్ స్పందించిందని నెట్టింట చర్చ జరుగుతోంది.

Next Story