Telugu Global
National

ఈమె అభినవ సతీ సావిత్రే.. మొసలితో పోరాడి భర్తను కాపాడుకుని..

భర్త కేకలు విన్న విమలాబాయి నది తీరం వద్దకు వచ్చింది. అక్కడ తన భర్తపై మొసలి దాడి చేయడం చూసింది. అంతే ఒక్క క్షణం కూడా ఆమె ఆలస్యం చేయలేదు.

ఈమె అభినవ సతీ సావిత్రే.. మొసలితో పోరాడి భర్తను కాపాడుకుని..
X

సత్యవంతుడు అర్ధాయుషు కలిగి తనకు పాము కరిచి చనిపోతుండగా సతీ సావిత్రి ఆ యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. సతీ సావిత్రి ధైర్యాన్ని మెచ్చిన యమధర్మరాజు వారిని ఆశీర్వదించి రాజ్యంతో పాటు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఓ మహిళ చంబల్ నది తీరాన తన భర్తను నోట క‌రుచుకున్న మొస‌లితో విరోచితంగా పోరాడి భర్త ప్రాణాలను కాపాడుకుంది. రాజస్థాన్ రాష్ట్రం కరౌలి జిల్లా మండరాయల్ సబ్ డివిజన్‌లో ఈ సంఘటన జరిగింది.

బనీసింగ్ మీనా(29), విమలాబాయి దంపతులు మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటారు. మంగళవారం వీరు మేత కోసం మేకలను చంబల్ నది తీరానికి తోలుకెళ్లారు. మేక‌లకు నీళ్లు తాగించేందుకు బనీ సింగ్ వాటిని నది వద్దకు తోలుకు వెళ్లాడు. తనకు కూడా దాహంగా ఉండటంతో నీళ్లు తాగడానికి నదిలోకి దిగాడు. అతడు నీళ్లు తాగుతుండగా ఊహించని విధంగా ఒక మొసలి అక్కడికి వచ్చి బనీ సింగ్ కాళ్లు గట్టిగా పట్టుకుంది. అతడిని లోపలికి లాక్కెళ్ళెందుకు ప్రయత్నించింది. దీంతో అతడు ప్రాణం భయంతో కేకలు పెట్టాడు.

భర్త కేకలు విన్న విమలాబాయి నది తీరం వద్దకు వచ్చింది. అక్కడ తన భర్తపై మొసలి దాడి చేయడం చూసింది. అంతే ఒక్క క్షణం కూడా ఆమె ఆలస్యం చేయలేదు. ఒక కర్ర తీసుకొని మొసలి వద్దకు వెళ్ళింది. ఆ కర్రతో మొసలిని చితక్కొట్టింది. ఆ దెబ్బలకు మొసలి బనీ సింగ్ ని వదలి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకొని బనీ సింగ్ ని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ ఘటనపై బనీసింగ్ మాట్లాడుతూ.. నదిలోకి దిగి నీరు తాగుతున్నా.. ఒక్క ఉదుటున అక్కడికి వచ్చిన మొసలి నా కాలు గట్టిగా పట్టుకుంది. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా నావల్ల కాలేదు. ఇక నా ప్రాణం పోవడం ఖాయం అనుకున్నా.. గట్టిగా కేకలు పెట్టా.. వెంటనే నా భార్య అక్కడికి వచ్చింది. ప్రాణాలకు తెగించి పోరాడి మొసలి నుంచి నన్ను కాపాడింది.' అని చెప్పాడు. 'ఎదురుగా ఉన్నది మొసలి అని తెలుసు. దాని చేతికి చిక్కితే ప్రాణం తీస్తుందని తెలుసు. అయినా ఆ క్షణంలో నా భర్త మాత్రమే కనిపించాడు. ఎలాగైనా అతడిని కాపాడాలనుకున్నాను. కర్ర తీసుకొని మొసలిని కొట్టడం ప్రారంభించా. అది నా దెబ్బలకు నా భర్తను వదిలేసి వెళ్ళింది.' అని విమలాబాయి చెప్పింది.

ప్రాణానికి తెగించి మొసలి బారి నుంచి తన భర్తను కాపాడుకున్న మహిళను అందరూ ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఘటన వైరల్ అయ్యింది. కళ్లెదుట బొద్దింక కనిపెడితేనే మహిళలు భయపడతారు. అలాంటిది మొసలిని చూసి భయపడకుండా ఎంతో తెగింపు ప్రదర్శించిన మహిళను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

First Published:  13 April 2023 5:49 AM GMT
Next Story