Telugu Global
National

రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్.. కొత్త పార్టీ ఏర్పాటుపై విశాల్ ప్రకటన

రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం సరైన వసతులు లేవని, వారికి సేవ చేయడం కోసం, అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు విశాల్ ప్రకటించారు.

రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్.. కొత్త పార్టీ ఏర్పాటుపై విశాల్ ప్రకటన
X

తమిళనాడులో మరో స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు హీరో విశాల్ ప్రకటించారు. చెన్నైలో జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ.. రాజకీయ అరంగేట్రంపై స్పందించారు. తాను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. పార్టీని ఏర్పాటు చేసి తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ప్రస్తుతం సరైన వసతులు లేవని, వారికి సేవ చేయడం కోసం, అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు విశాల్ ప్రకటించారు.

విశాల్ ఇదివరకే ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించారు. 2017లో జయలలిత మరణం తర్వాత ఆమె ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న అన్నా నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ కూడా వేశారు. అయితే వివిధ కారణాలతో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. అప్పటి నుంచి విశాల్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

ఇటీవల తమిళనాడులో అగ్ర హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే విశాల్ కూడా కొత్త పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆ వార్తలను విశాల్ ఖండించారు. ఇది జరిగి రెండు నెలలు కూడా గడవకముందే తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు విశాల్ ప్రకటించారు. ముందు తనను తాను నిరూపించుకోవాలని, ఆ తర్వాతే మిగిలిన పార్టీలతో పొత్తు గురించి ఆలోచిస్తానని ఈ సందర్భంగా విశాల్ మీడియాకు వివరించారు.

కాగా, తమిళనాడులో అగ్ర హీరోలు అందరూ వరుసగా రాజకీయాల్లోకి వెళ్తున్నారు. కమలహాసన్ గత ఎన్నికలకు ముందే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయగా.. ఇటీవల అగ్ర హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ఆయన కూడా 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెట్టారు. ఇప్పుడు మరో అగ్ర హీరో అయిన విశాల్ కూడా త్వరలోనే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

First Published:  14 April 2024 10:49 AM GMT
Next Story