Telugu Global
National

త‌మిళ‌నాట‌ త్వ‌ర‌లో హీరో విజ‌య్ పాద‌యాత్ర‌..! - జాతీయ మీడియాలో క‌థ‌నాలు

'విజయ్ మక్కల్ ఇయక్కం' (VMI) అభిమాన సంఘం సభ్యులతో విజ‌య్ ఇటీవ‌ల త‌ర‌చూ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే మంగ‌ళ‌వారం కూడా ఆయ‌న వారితో భేటీ అయిన‌ట్టు తెలిసింది.

త‌మిళ‌నాట‌ త్వ‌ర‌లో హీరో విజ‌య్ పాద‌యాత్ర‌..! - జాతీయ మీడియాలో క‌థ‌నాలు
X

స్టార్ హీరో విజ‌య్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడు రాష్ట్రమంత‌టా పాద‌యాత్ర చేసేందుకు స‌న్న‌ద్ధం అవుతున్నారా..? జాతీయ మీడియా ఈ విష‌య‌మై కోడై కూస్తోంది. త‌మిళ‌నాట ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పాద‌యాత్ర చేస్తారనే వార్త తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వార్త‌లో నిజ‌మెంతున్నా.. ఈ విష‌యం మాత్రం సినీ, రాజ‌కీయ రంగాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

'విజయ్ మక్కల్ ఇయక్కం' (VMI) అభిమాన సంఘం సభ్యులతో విజ‌య్ ఇటీవ‌ల త‌ర‌చూ భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే మంగ‌ళ‌వారం కూడా ఆయ‌న వారితో భేటీ అయిన‌ట్టు తెలిసింది. ఈ భేటీలో పాద‌యాత్ర‌పై నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఆయన నటించిన తాజా చిత్రం 'లియో' విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. `లియో` చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈలోపు విజయ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల విజ‌య్ చేప‌డుతున్న సామాజిక కార్య‌క్ర‌మాలు గ‌మ‌నిస్తే.. ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ ఖాయ‌మేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అది కూడా రాబోయే ఎన్నిక‌లే టార్గెట్‌గా ఆయ‌న ముందుకెళుతున్నార‌ని తెలుస్తోంది. దానిక‌నుగుణంగానే ఇటీవ‌ల ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించడం అందులో భాగ‌మేన‌ని అంటున్నారు.

First Published:  12 July 2023 11:46 AM GMT
Next Story