Telugu Global
National

బీజేపీలో చేరడం లేదు.. బొమ్మైకి మాత్రం మద్దతిస్తున్నా.. కిచ్చ సుదీప్ క్లారిటీ

తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. బొమ్మై తనకు ఎంతో సన్నిహితుడని, తనకు గాడ్ ఫాదర్ లాంటివారని చెప్పారు.

బీజేపీలో చేరడం లేదు.. బొమ్మైకి మాత్రం మద్దతిస్తున్నా.. కిచ్చ సుదీప్ క్లారిటీ
X

తాను బీజేపీలో చేరడం లేదని, ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదని కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ప్రకటించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మాత్రం తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఇవాళ కన్నడ అగ్ర హీరోలు సుదీప్, దర్శన్ బీజేపీలో చేరతారని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం సుదీప్ ఒక్కడే బెంగళూరులో సీఎం బొమ్మైతో సమావేశమ‌య్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కొంతసేపు వారిరువురు చర్చించుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి బొమ్మై, కిచ్చ సుదీప్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. బొమ్మై తనకు ఎంతో సన్నిహితుడని, తనకు గాడ్ ఫాదర్ లాంటివారని చెప్పారు. కష్టాల్లో ఉన్న సమయంలో బొమ్మై తనకు అండగా నిలిచారన్నారు. బొమ్మైకి తన మద్దతు ఉంటుందని, ఆయనకు మద్దతు ఇస్తున్నాను అంటే దానర్థం ఆయన సూచించిన వారందరికీ అని చెప్పారు.

అనంతరం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ సుదీప్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. కేవలం తనకు, తన పార్టీకి మద్దతు తెలపడానికి మాత్రమే ఆయన వచ్చినట్లు తెలిపారు. కాగా.. సుదీప్ తో పాటు దర్శన్ కూడా బొమ్మైని కలుస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. కర్ణాటకలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మే 10వ తేదీన ఎన్నికలు జరగనుండగా, 13వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

First Published:  5 April 2023 11:44 AM GMT
Next Story