Telugu Global
National

అత‌డే నా వార‌సుడు .. : బిహార్ సిఎం నితీష్ కుమార్

త‌న రాజ‌కీయ వార‌సుడు తేజ‌ప్వియేన‌ని సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. '‘నేను ప్రధాని అభ్యర్థిని లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు.. బీజేపీని ఓడించ‌డ‌మే నాల‌క్ష్యం. అందువ‌ల్ల మీరంతా తేజస్విని ప్రోత్సహించాలి’’ అన్నారాయన.

అత‌డే నా వార‌సుడు .. : బిహార్ సిఎం నితీష్ కుమార్
X

బిహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ మంగ‌ళ‌వారంనాడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో 2025 లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అధికార కూట‌మిని ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ ముందుండి న‌డిపిస్తార‌ని ప్ర‌క‌టించారు. త‌న రాజ‌కీయ వార‌సుడు తేజ‌ప్వియేన‌ని సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించారు. అంటే ముఖ్య‌మంత్రిగా ఆయ‌న త‌న ప‌ద‌వీ కాలానికి కౌంట్ డౌన్ ప్రారంభించిన‌ట్టే.

బీహార్ అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. 'నేను ప్రధాని అభ్యర్థిని లేదా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదు.. బీజేపీని ఓడించ‌డ‌మే నాల‌క్ష్యం అని అన్నారు. "అందువ‌ల్ల మీరంతా తేజస్విని ప్రోత్సహించాలి'' అన్నారాయన.

తేజస్వి యాదవ్‌ను తన రాజకీయ వారసుడిగా చూస్తున్నట్లు నితీష్ కుమార్ నిన్నటి నుండి అనేక సూచనలను చేస్తున్నారు. సోమవారం తేజ‌స్వి యాద‌వ్ తో క‌లిసి నలందలో డెంటల్ కళాశాల ప్రారంభోత్సవంలో ముఖ్య‌మంత్రి పాల్గొన్నారు. ఈ స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. "మేము చాలా చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా చేయడానికి ఏదైనా మిగిలి ఉంటే, తేజస్వి ఆ పనుల‌ను అన్నింటినీ పూర్తి చేస్తారు. మమ్మల్ని విభజించాలనుకునే వారు, ఇక ఆ ప్ర‌య‌త్నాల‌ను విర‌మించుకోండి. మ‌మ్మల్ని ఎవ‌రూ వేరు చేయ‌లేరు. ఇబ్బంది సృష్టించడానికి ప్రయత్నించవద్దు. మేము ఐక్యంగా ఉండి కలిసి పని చేస్తాం. ఎలాంటి విభేదాలు ఘర్షణలు ఉండవు' అని అన్నారు. "తేజస్వి ఇక్కడే ఉన్నారు. అతనిని ముందుకు తీసుకెళ్లడానికి నేను చేయగలిగినదంతా చేసాను, నేను అతన్ని ఇంకా ముందుకు తీసుకెళతాను. మీరందరూ చూసి అర్థం చేసుకోండి. మా అధికారులందరూ బాగా పని చేస్తున్నారు. మేం ఏం చేసినా గాంధీ మార్గాన్నే అనుసరిస్తున్నాము " అని ఆయన అన్నారు.

దీంతో తేజ‌ప్విని వార‌సుడిగా ప్ర‌క‌టించ‌డ‌మే నితిష్ కుమార్ వ్యాఖ్య‌ల అర్ధం అనే ప్ర‌చారం జోరందుకుంది. ఈ ప్ర‌చారానికి ఈ రోజు అధికార కూట‌మి ఎమ్మెల్యేల స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత బ‌లం చేకూరుస్తున్నాయి. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై తేజ‌స్వి యాద‌వ్ స్పందిస్తూ.. ప్ర‌స్తుతం త‌న ముందున్న ల‌క్ష్యం 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌లేన‌ని, ఆ త‌ర్వాత మిగ‌తా విష‌యాల‌పై దృష్టి సారిస్తాన‌ని అన్నారు.

గ‌త నెల‌లో తేజస్వి మాట్ల‌డుతూ.. తాను చాలా అదృష్ట‌వంతుడిన‌ని అన్నారు. త‌న త‌లిద‌తండ్రులు ముఖ్య‌మంత్రులుగా, విప‌క్ష నేత‌లుగా ప‌నిచేశార‌ని, తాను రెండు సార్లు ఉప‌ముఖ్య‌మంత్రిగా, విప‌క్ష నేత‌గా ఒక‌సారి ప‌ని చేశాన‌ని చెప్పారు. ఎంతో అనుభ‌వ‌జ్ఞుడైన నితీష్ కుమార్ నేతృత్వంలో ఉప ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్నందుకు తాను అదృష్ట‌వంతుడిన‌ని వ్యాఖ్యానించారు.

First Published:  13 Dec 2022 4:11 PM GMT
Next Story