Telugu Global
National

ద్వేషపూరిత ప్రసంగాల‌ను అరికట్టాలి -సుప్రీంకోర్టు

ఈ మధ్య పెరిగిపోతున్న ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాది ఉత్తరాఖండ్ లోనూ, ఢిల్లీలోనూ జరిగిన ధరమ్ సంస‌ద్ లలో ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని సుప్రీంకోర్టు వివ‌ర‌ణ కోరింది.

ద్వేషపూరిత ప్రసంగాల‌ను అరికట్టాలి  -సుప్రీంకోర్టు
X

దేశంలోని మైనారిటీలకు వ్యతిరేకంగా చేస్తున్న ద్వేషపూరిత ప్రసంగాలను అరిక‌ట్టాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ ర‌క‌మైన ప్ర‌సంగాల వ‌ల్ల స‌మాజంలో మొత్తం వాతావరణం చెడిపోతోందని, ఈ ధోర‌ణిని వెంట‌నే అరికట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. గత ఏడాది ఉత్తరాఖండ్ లోనూ, ఢిల్లీలోను జరిగిన ధరమ్ సంస‌ద్ లలో ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఉత్తరాఖండ్, ఢిల్లీ ప్రభుత్వాల నుండి ఒక ప్రత్యేక కేసు సంద‌ర్భంగా సుప్రీంకోర్టు వివ‌ర‌ణ కోరింది.

ఢిల్లీలోని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) , ఇతర నిర్వాహకులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపిన రోజునే కోర్టు ఈ ఆదేశాలు రావ‌డం గ‌మ‌నార్హం. విహెచ్ పి నిర్వ‌హించిన ఈ స‌భ‌లో కొంతమంది వక్తలు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారని పోలీసులు కేసు న‌మోదు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్ , జస్టిస్ ఎస్ ఆర్ భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ సమయంలో తీసుకున్న చర్యలతో సహా ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన ప్రత్యేక సందర్భాల వివరాలను ఇవ్వాలని పిటిషనర్ హెచ్ మన్సుఖానీని కోరింది. "ఈ రకమైన పిటిషన్, ఒక పౌరుడిగా, ఈ ద్వేషపూరిత ప్రసంగాల ఫలితంగా మొత్తం వాతావరణం చెడిపోతోందని మీరు చెప్పడం సరైనదే కావ‌చ్చు. దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు అన్ని సమర్థనీయమైన కారణాలు ఉండవచ్చు."అని పేర్కొంది.

అయితే, న్యాయస్థానం ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటే, వాస్తవ నేపథ్యం ఉండాలి. పిటిషనర్ ఒకటి , రెండు సందర్భాలను తెలిల‌య‌జేయ‌వ‌చ్చు అని ధర్మాసనం పేర్కొంది. "ఇది చాలా యాదృచ్ఛిక పిటిషన్, ఎవ‌రో ద్వేషపూరిత ప్రసంగం చేసిన 58 సందర్భాలు ఉన్నాయి.అలాకాకుండా ప్ర‌త్యేకంగా ద్వేష‌పూరిత ప్ర‌సంగం చేసిన వ్య‌క్తులు కానీ , నేరం కానీ దానికి సంబంధించిన ఏదేని కేసు న‌మోద‌యిందా లేదా అనే విష‌యాలు మాకు తెలియదు'' అని కోర్టు పేర్కొంది.

అందువ‌ల్ల కొన్ని సంఘటనలపై దృష్టి సారించి, విచారణ సమయంలో తీసుకున్న చర్యలు ఏవైనా ఉంటే వాటితో సహా సంబంధిత నేర వివరాలను తెలియజేస్తూ అదనపు అఫిడవిట్‌ను సమర్పించేందుకు పిటిషనర్‌కు బెంచ్ సమయం ఇచ్చింది. కేసులు నమోదయ్యాయా, దోషులు ఎవరనే వివరాలను కూడా పిటిష‌న‌ర్ తెలియజేయవచ్చని తెలిపింది. అక్టోబర్ 31లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని, నవంబరు 1న పోస్ట్ చేయాలని పేర్కొంది.

విచారణ సందర్భంగా, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకునే విద్వేష ప్రసంగాలు, నేరాలు జ‌రుగుతున్నాయ‌ని పిటిష‌నర్ లేవనెత్తారు. ఈ రోజుల్లో ద్వేషపూరిత ప్రసంగాలు "లాభదాయకమైన వ్యాపారం గా మారాయ‌ని " కూడా ఆమె ఆరోపించారు.

First Published:  11 Oct 2022 6:57 AM GMT
Next Story