Telugu Global
National

మోదీజీ.. క్యా హువా తేరా వాదా..?

ఎనిమిదేళ్లలో మోదీ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయాయి. గతంకంటే పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది.

మోదీజీ.. క్యా హువా తేరా వాదా..?
X

సోషల్ మీడియా ప్రచారంతో తనని తాను దేశోద్ధారకుడిగా భ్రమింపజేసి, బీజేపీ సీనియర్లందర్నీ పక్కకు నెట్టి 2014 ఎన్నికల తర్వాత సరాసరి గుజరాత్ పీఠం నుంచి ప్రధాని పీఠానికి ఎగబాకారు నరేంద్ర మోదీ. సరిగ్గా ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన బెండు తీస్తోంది. అధికారంలోకి రాకముందు, వచ్చిన కొత్తల్లో ఆయన ఇచ్చిన వాగ్దానాలు, చేసిన ప్రతిజ్ఞలు, ప్రజల చెవిలో పెట్టిన పూలు అన్నీ ఒక్కొక్కటే ఇప్పుడు బయటపడుతున్నాయి. 2022నాటికి దేశంలో సొంత ఇల్లు లేని నిరుపేద ఎవ‌రూ మిగలరు అని అప్పట్లో ఢంకా భజాయించారు మోదీ, కానీ ఇప్పుడు ఆ హామీ గురించి అడిగేవారు లేరు, అడిగినా పట్టించుకునే నాధుడే లేరు. ఉద్యోగం కావాలంటే బీజేపీకి ఓటు వేయండని చెప్పారు ఆనాడు, ఇప్పుడు ఓటు వేసిన పాపానికి ఉన్న ఖాళీలు కూడా పూడ్చేస్తున్నారు. అగ్నిపథ్ వంటి కొత్త స్కీమ్ లతో నిరుద్యోగుల్ని నిండా ముంచేస్తున్నారు.

నల్లడబ్బు తెస్తా, మీ అకౌంట్లలో జమ చేస్తా..

పెద్ద నోట్ల రద్దు అనే ఓ విఫల ప్రయోగం చేసి మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి డీమానిటైజేషన్ ద్వారా విదేశాల్లో ఉన్న నల్లడబ్బు భారత్ కి తిరిగొస్తుందని, అది పేదల అకౌంట్లలో జమపడుతుందని గొప్పలు చెప్పుకున్నారు మోదీ. కానీ పెద్దనోట్ల రద్దుతో పెద్దలు బాగున్నారు కానీ, పేదలే తీవ్రంగా నష్టపోయారు. ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్ ఇచ్చే బాధ్యత తనదేనన్నారు, వరద నీటితో ప్రజలు సతమతం అవుతున్నారే కానీ, ఇంటింటికీ నల్లా కనెక్షన్ మాత్రం రాలేదు. కొన్నిచోట్ల రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయా సమస్యలు పరిష్కారం అయ్యాయి కానీ, అందులో కేంద్రం వాటా ఏమీ లేదు.

డాలర్ - రూపాయి.. అదో పెద్ద కట్టుకథ..

కాంగ్రెస్ హయాంలో రూపాయి విలువ పడిపోతోందని ఎద్దేవా చేసిన బీజేపీ నేతలు, ఇప్పుడు రూపాయి తన సహజరీతిలో వెళ్తోందని చెప్పడం, స్వయానా ఆర్థిక మంత్రితో ఆ మాట చెప్పించడం నిజంగా భారత ఆర్థిక వ్యవస్థకు సిగ్గుచేటని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. రైతుల ఆదాయం రెట్టింపవుతుందనేది కూడా ఎండమావి లాంటి హామీనే. రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గకపోతే, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి ఈపాటికే గట్టి గుణపాఠం లభించి ఉండేది. వంట గ్యాస్ సిలిండర్ రేటు 10 రూపాయలు పెరిగినందుకే అప్పట్లో బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు, ఇప్పుడు ప్రజలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ ఆ అవకాశం లేకుండా ఏకంగా విడతకి 100 రూపాయలు బాదిపడేస్తున్నారు. వంటగ్యాస్ రేటులో ప్రపంచంలోనే భారత్ ని అగ్రగామిగా నిలబెట్టారు.

ఏం చెప్పారు - ఏం చేస్తున్నారు..?

మోదీ హామీలన్నీ విఫలమయ్యాయి. ఒక్కో ఏడాది గడిచే కొద్దీ ఒక్కో హామీకి కాలం చెల్లిపోతూ ఉంది. మొత్తానికి ఎన్నికల ముందు అందమైన సుందర స్వప్నాన్ని చూపించిన ఆయన, ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. గత పాలకులను తిట్టీ తిట్టీ ఇప్పుడు ఎనిమిదేళ్ల తన పాలనను కనీసం సమీక్షించుకోవ‌డానికి కూడా మోదీ సాహసం చేయలేకపోతున్నారు. ఎనిమిదేళ్లలో మోదీ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయాయి. గతంకంటే పరిస్థితి మరీ ఘోరంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. క్యాహువా తేరా వాదా అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంది.

Next Story