Telugu Global
National

మోడీ షాల చేతుల్లో ఆరెస్సెస్ కీలుబొమ్మలా మారిందా ?

ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం తర్వాత ఆరెస్సెస్ లోని ఒక వర్గం తీవ్ర అసంత్రుప్తితో ఉందని సమాచారం. బీజేపీకి మార్గదర్శకంగా ఉండాల్సిన ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు బీజేపీకి అనుచరురాలుగా మారిందని ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు.

మోడీ షాల చేతుల్లో ఆరెస్సెస్ కీలుబొమ్మలా మారిందా ?
X

ఆరెస్సెస్ సేవ ఆధారిత సామాజిక-సాంస్కృతిక సంస్థగా, దేశ సంస్కృతిని, సాంప్ర‌దాయాలను కాపాడే సంస్థగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఆ సంస్థ అద్వర్యంలో వందలాది సంస్థలు నడుస్తుంటాయి. ఒక్కో దానిది ఒక్కో లక్ష్యం. అందులో బీజేపీ కూడా ఒకటి. బీజేపీ ఆరెస్సెస్ కు రాజకీయ ముఖం. బీజేపీలో ముఖ్య భూమిక పోషించేవారంతా ఆరెస్సెస్ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే ఇప్పుడు దేశంలో తీవ్రంగా జరుగుతున్న చర్చ ఏంటంటే... బీజేపీని ఆరెస్సెస్ నడుపుతోందా ? లేక బీజేపీయే ఆరెస్సెస్ ను నడుపుతోందా ? అనేది.

ఆరెస్సెస్ తనను తాను నీతి నిజాయితీలకు నిలువుటద్దంలా చెప్పుకుంటుంది. ఆ సంస్థలోని ముఖ్యమైన నాయకులు కుటుంబాలను వదులుకొని, పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా సంస్థ కోసం పని చేస్తుంటారని గర్వంగా చెప్పుకుంటారు ఆరెస్సెస్ కార్యకర్తలు. మరి అదే ఆరెస్సెస్ నుంచి వ‌చ్చిన బీజేపీ నాయకులు ప్రస్తుతం వ్యవ‌హరిస్తున్న తీరు ఆరెస్సెస్ అగ్రనేతలకు సమ్మతమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టిన తీరు, తెలంగాణ టీఆరెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చేసిన ప్రయత్నం.... మొత్తం వేల కోట్ల రూపాయల వ్యవహారమే. అంతా అవినీతి, అక్రమాల మయమే. చట్ట వ్యతిరేకమూ, రాజ్యాంగ వ్యతిరేకం కూడా. చట్టమూ, రాజ్యాంగమూ అంటే అరెస్సెస్ కు పెద్దగా పట్టింపు లేకపోవచ్చు కానీ నైతిక వ్యవహారాల పట్ల చాలా గొప్పగా ఉంటామని చెప్పుకునే ఆరెస్సెస్ డబ్బు చుట్టూ తిరిగిన ప్రభుత్వాల కూలగొట్టే వ్యవ‌హారాన్ని ఎలా సమర్దించుకుంటుంది ?

మహారాష్ట్రలో శివసేనలో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని కూల్చి తాము అధికారంలోకి రావడానికి అయిన ఖర్చు దాదాపు 1000 కోట్ల రూపాయలనే ప్రచారం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చేయడంలో కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి.

ఇక తెలంగాణలో అయితే బీజేపీ లో చేరితే ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఇవ్వడానికి సిద్దపడి బేరాలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిందో ముగ్గురు సభ్యుల బ్యాచ్. ఆ బ్యాచ్ లోని కీలక వ్యక్తి రామచంద్ర భారతి చెప్పిన ప్రకారం.. ఢిల్లీలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగింది. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇవ్వడానికి సిద్దపడ్డారు. త్వరలోనే ఏపీ, బెంగాల్ ప్రభుత్వాలను కూడా కూల్చేస్తామని కూడా రామచంద్ర భారతి చెప్పారు.

ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ ప్రముఖుడు, ఆ సంస్థ నుంచి బీజేపీకి కేటాయించబడ్డ, బీజేపీలో ప్రస్తుతం చాలా కీలకంగా వ్యవహరిస్తున్న బీఎల్ సంతోష్ అనే నాయకుడి పాత్ర కీలకమని రామచంద్ర భార‌తి చెప్పాడు. అంతే కాదు దొరికిపోయిన ఆ ముగ్గురు దళారీలు(రామచంద్ర భారతి, సోమయాజి, నంద కుమార్) తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లకు మాత్రమే కాకుండా, RSS అగ్రనేతలు BL సంతోష్ కు కూడా చాలా సన్నిహితులమ‌ని పేర్కొన్నారు.

మరి ఆరెస్సెస్ లో, బీజేపీ లో అందరూ సంతోష్ జీ అని పిల్చుకునే బీఎల్ సంతోష్ వ్యవహారంలో ఆరెస్సెస్ స్పందన ఏంట‌న్నది ఇప్పటి వరకు తెలియరాలేదు.

ఇక్కడ రెండు ప్రశ్నలు ఎదురవుతాయి ? ఈ వ్యవహారాలు ఆరెస్సెస్ కు తెలియకుండా జరుగుతున్నాయా? లేక ఆరెస్సెస్ ప్రస్తుతం మోడీ, షాల ద్వయం చెప్పినట్టు నడుచుకుంటుందా ?

నిజానికి బిజెపిలో జరుగుతున్న పరిణామాలపై నిఘా ఉంచడం, ఆరెస్సెస్ సైద్ధాంతిక ఎజెండా, విజన్‌కు బీజేపీ కట్టుబడి ఉండేలా చూడటం బీఎల్ సంతోష్ పని. అయితే సంతోష్ ఆరెస్సెస్ అప్పజెప్పిన పనిలోనే ఉన్నారా లేక మోడీ, షాల ద్వయం చెప్పినట్టల్లా ఆడుతున్నారా అనే అనుమానం ఇప్పుడు ఆరెస్సెస్ లోని కొందరు కార్యకర్తలకు కూడా వస్తున్నది.

ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం తర్వాత ఆరెస్సెస్ లోని ఒక వర్గం తీవ్ర అసంత్రుప్తితో ఉందని సమాచారం. బీజేపీకి మార్గదర్శకంగా ఉండాల్సిన ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు బీజేపీకి అనుచరురాలుగా మారిందని ఆర్‌ఎస్‌ఎస్‌లోని ఒక వర్గం నాయకులు భావిస్తున్నారు. బిజెపి దారి తప్పినప్పుడల్లా రాజకీయ మార్గాన్ని నిర్దేశం చేయడం లేదా సరిదిద్దడం వంటి పెద్ద సోదరుడి పాత్రలో కాకుండా, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు బిజెపి నాయకత్వ చర్యలకు మద్దతు ఇచ్చే పాత్రకు దిగజారింది అనేది వారి బాధ‌.

అనేక సమస్యలపై ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు బీజేపీకి చాలా లౌక్యంగా సందేశాలు పంపుతోంది. ఇటీవల, జ్ఞాన్‌వాపి మసీదు సమస్యపై బిజెపి నాయకులు ముస్లింలకు వ్యతిరేకంగా గళం విప్పినప్పుడు, ప్రతి మసీదును తవ్వితీస్తానని శవమొస్తే మీకు, శివలింగమొస్తే మాకు అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బెదిరించిన సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ "ప్రతి మసీదులో ఒక శివలింగం కోసం వెతకాల్సిన అవసరం ఏమిటి" అని గట్టిగా ప్రశ్నించారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కి ఉన్న శక్తి అటువంటిది, మరుసటి రోజు నుండి బిజెపి జ్ఞానవాపి విషయంలో మాట్లాడటం తగ్గించేశారు.

అలాంటి ఆర్‌ఎస్‌ఎస్ ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం చెప్పుచేతల్లో నడుస్తోందా అనే అనుమానాలు వస్తున్నాయి. లేదంటే టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలో దొరికిపోయిన నిందితులు చెప్పినట్టు. ఈ మొత్తం వ్యవహారాలకు ఆర్ఎస్సెస్సే మార్గనిర్దేశం చేస్తుందా అనేది అగ్రశ్రేణి నాయకులలో చర్చనీయాంశమైన ప్రశ్న. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి మార్గదర్శకత్వంలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాలను కూల్చివేసి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో కూడా ఇలాంటి తిరుగుబాట్లకు ప్రణాళికలు వేస్తున్నట్లు అరెస్టయిన దళారులు చెప్పిన విషయం ఇక్కడ గమనార్హం.

దీంతో మోడీ-షా ద్వయం ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే శక్తిమంతంగా మారిందా, సమాజం పట్ల నిబద్ధతతో ఉంటామని చెప్పుకునే సంస్థ దిగజారిపోయిందా అనే వాదనలకు దారితీస్తోంది. ఇప్పుడు తమను బీజేపీకి అనుబంధంగా పరిగణిస్తున్నారనే భావన కొందరు ఆరెస్సెస్ నేతలలో నెలకొంది.

మోదీ-షా ద్వయం రాజకీయ కుతంత్రాలకు మద్దతుగా నిలిచిన ఆర్‌ఎస్‌ఎస్‌ తన స్వభావాన్ని కోల్పోతుందా? 97 ఏళ్ల నాటి ఆ సంస్థ ఒక కీలుబొమ్మగా మారుతుందా అనేది ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ థింక్ ట్యాంక్‌ను వేధిస్తున్న ప్రశ్న.

Next Story