Telugu Global
National

హర్యానాలో సంచలనం.. సీఎం సహా మంత్రుల రాజీనామా

మొత్తం 90 మంది సభ్యులు గల హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 30 మంది, దుష్యంత్ చౌతాలాకు చెందిన జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

హర్యానాలో సంచలనం.. సీఎం సహా మంత్రుల రాజీనామా
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హర్యానా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సీఎం మనోహార్ లాల్‌ ఖట్టర్ సహా మంత్రులందరూ పదవులకు రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం సీఎం పదవికి రాజీనామా చేశారు ఖట్టర్‌.

మిత్రపక్షం జననాయక్‌ జనతా పార్టీతో వచ్చిన విబేధాలే ఈ రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రాకపోవడంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని JJPతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎంపీ సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జేజేపీతో స్నేహానికి గుడ్‌బై చెప్పాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇవాళే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, హర్యానా లోకహిత్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రి అర్జున్ ముండా, తరుణ్‌ చుగ్‌లను పార్టీ అబ్జర్వర్లుగా హర్యానాకు పంపింది బీజేపీ హైకమాండ్.

మొత్తం 90 మంది సభ్యులు గల హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 30 మంది, దుష్యంత్ చౌతాలాకు చెందిన జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఇండియన్ లోక్‌దళ్‌ -INLD, హర్యానా లోకహిత్‌ పార్టీ-HLP పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.

బీజేపీ-జేజేపీ మధ్య వివాదం ఇదే-

హర్యానాలో మొత్తం 10 పార్లమెంట్ స్థానాలుండగా.. జేజేపీ రెండు స్థానాలు కోరినట్లు సమాచారం. అయితే రెండు స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని తెలుస్తోంది. హర్యానాలోని మొత్తం 10 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ఉన్న దుష్యంత్ చౌతాలా సోమవారం బీజేపీ చీఫ్ నడ్డాను కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని సమాచారం. ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.

First Published:  12 March 2024 8:37 AM GMT
Next Story