Telugu Global
National

మణిపూర్ బాటలో హర్యానా.. అక్కడా బీజేపీయే

అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఇటు హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ రెండుచోట్లా డబుల్ ఇంజిన్ పనిచేయలేక చేతులెత్తేసింది, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

మణిపూర్ బాటలో హర్యానా.. అక్కడా బీజేపీయే
X

మణిపూర్ లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు హర్యానా కూడా తగలబడిపోతోంది. ఇక్కడ మత ఘర్షణలు చినికి చినికి గాలివానలా మారాయి. నూహ్, గురుగ్రామ్ జిల్లాలు అల్లర్లతో అట్టుడికిపోతున్నాయి. హింసాత్మక ఘటనల్లో ఐదుగురు చనిపోగా, అందులో ఇద్దరు పోలీసులు. మొత్తం 23మంది గాయపడగా, అందులో 10మంది పోలీసులున్నారు. ముగ్గురు పోలీసులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. హర్యానా అల్లర్లలో 120 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలు హోటళ్లను ఆందోళనకారులు తగలబెట్టారు.


అల్లర్లతో అట్టుడికిన మణిపూర్ లో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఇటు హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ రెండుచోట్లా డబుల్ ఇంజిన్ పనిచేయలేక చేతులెత్తేసింది, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా, మొట్టికాయలు వేసినా, ఘాటు వ్యాఖ్యలు చేసినా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం విశేషం.

హర్యానాలోని నూహ్ జిల్లాలో ఓ మతానికి సంబంధించిన ర్యాలీపై కొంతమంది రాళ్లు వేయడంతో గొడవ మొదలైంది. ఆ తర్వాత అది మెల్లగా గురుగ్రామ్ జిల్లాకి వ్యాపించింది. తాజాగా పల్వాల్ జిల్లాలో కూడా 25 గుడిసెలకు ఆందోళనకారులు నిప్పంటించడంతో గొడవలు మరింత పెరిగాయి.

ప్రభుత్వం ఏమంటోంది..?

మణిపూర్ అల్లర్ల తర్వాత సీఎం బీరేన్ సింగ్ రాజీనామా అంటూ చిన్న డ్రామా నడిపించారు, చివరకు ప్రజలే తన రాజీనామా వద్దంటున్నారంటూ సైలెంట్ అయ్యారు. ఇక్కడ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. తప్పంతా ప్రతిపక్షాలపై నెట్టేశారు. హర్యానా అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉందన్నారాయన. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హర్యానా అల్లర్లతో ఢిల్లీలో కూడా అప్రమత్తత ప్రకటించింది కేజ్రీవాల్ ప్రభుత్వం.

First Published:  2 Aug 2023 4:20 AM GMT
Next Story