Telugu Global
National

మహారాష్ట్ర: BJP మద్దతుతో MNS గూండాగిరి, వృద్ద మహిళపై దాడి

మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో MNS కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. తన షాపు ముందు MNS కార్యకర్తలు బ్యానర్ కడుతుంటే అడ్డుచెప్పినందుకు ముంబైలో ఓ వృద్ద మహిళను దారుణంగా కొట్టారు.

మహారాష్ట్ర: BJP మద్దతుతో MNS గూండాగిరి, వృద్ద మహిళపై దాడి
X

మహారాష్ట్ర మహా అగాడీ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ మద్దతుతో శివసేన చీలిక ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుండి మహా రాష్ట్ర నవ నిర్మాణ్ సేన (MNS) రెచ్చిపోతోంది. శివసేనను ఎదుర్కోవడానికి తమకు మద్దరుగా ఠాక్రే ఫ్యామిలీ నుండి ఓ మనిషి కావాలని భావించిన బీజేపీ బాలాసాహెబ్ ఠాక్రే తమ్ముడి కొడుకైన రాజ్ ఠాక్రేను దగ్గరికి తీశారు. అసలే ఉద్దవ్ థాక్రేపై అక్కసుతో శివసేన నుండి చీలిపోయి MNS ఏర్పాటు చెసిన రాజ్ ఠాక్రేకు ఇది అందివచ్చిన అవకాశం. దాంతో బీజేపీ మద్దతుతో MNS ముంబైలో చెలరేగిపోతోంది. ముందునుంచి గూండాగిరికి పేరెన్నికగల ఆ పార్టీ ప్రభుత్వ మద్దతు కూడా ఉండటంతో ఇక అడ్డూ ఆపూ లేకుండ ప్రవర్తిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

MNS కార్యకర్తలు నిన్న వృద్దురాలైన‌ ప్రకాష్ దేవి అనే మహిళ పై దారుణంగా దాడి చేశారు. ముంబై లోని కామాటీ పురాలో ప్రకాష్ దేవి నడుపుతున్న‌ మెడికల్ షాపు ముందు MNS కార్యకర్తలు పెద్ద పెద్ద కర్రలు పాతి, తమ ఫ్లెక్సీని కట్టారు. అది షాపుకు అడ్డుగా ఉండటంతో ఆ మహిళ అడ్డు చెప్పింది. దాంతో ఆ గుంపు ఆమెను దుర్భాషలాడారు. ఆ గుంపుకు నాయకత్వం వహిస్తున్న MNS నాయకుడు వినోద్ అర్గిలే అనే వ్యక్తి ఆ మహిళతో వాగ్వివాదానికి దిగి ఆమెను కొట్టాడు. ఆమెను లాక్కెళ్ళి కిందపడేశాడు. అతనికి మద్దతుగా మరికొందరు MNS కార్యకర్తలు కూడా ఆమెపై దాడికి దిగారు.


దీనిపై ఆ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వినోద్ ఆర్గిల్, రాజు ఆర్గిల్, సతీష్ లాడ్ లపై కేసు నమోదు చేశారు.

అయితే స్థానిక MNS నాయకుడు కేశవ్ ములే మాత్రం ఆ మహిళదే తప్పన్నట్టు మాట్లాడాడు. '' మాకు స్త్రీలపై విపరీతమైన గౌరవం ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో పూర్తి వీడియో కాదు. ఆమె మాపార్టీ బ్యానర్ ను కాలితో తన్నింది. మా పార్టీ కార్యకర్తలను దుర్భాషలాడింది. అందుకే మా వాళ్ళు ఆమెను కొట్టాల్సి వచ్చింది. అయినా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది.'' అని అన్నారు.

మరో వైపు సోషల్ మీడియాలో MNS పై నెటిజనులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వ మద్దతుతో ఆ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని నెటిజనులు ఆరోపిస్తున్నారు.

First Published:  2 Sep 2022 7:10 AM GMT
Next Story