Telugu Global
National

'గుజరాత్ మోడల్ అభివృద్ది'.. చెత్త చెదారంపై తెల్లగుడ్డలు, పాత గోడలపై కొత్త రంగులు

గుజరాత్ లో బ్రిడ్జి కూలి 135 మంది మరణించిన మోర్బీ పట్టణాన్ని ప్రధానిమోడీ ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు చేసిన డ్రామాలపై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.

గుజరాత్ మోడల్ అభివృద్ది.. చెత్త చెదారంపై తెల్లగుడ్డలు, పాత గోడలపై కొత్త రంగులు
X

గుజరాత్ లోని మోర్బీ పట్టణంలో ఆదివారంనాడు వంతెన కూలిపోయి 135 మంది మరణించిన (ప్రభుత్వ లెక్క ప్రకారం) విషయం తెలిసిందే. ఈ సంఘటనలో అనేక మంది గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధానిమోడీ ఈ రోజు మోర్బీ పట్టణానికి వచ్చారు. ప్రమాదం జరిగిన మచ్చు నది ప్రాంతాన్ని, బాధితులున్న ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం సాగించిన డ్రామా అంతా ఇంతా కాదు.

ఆదివారం రాత్రి బ్రిడ్జి కూలిపోయి 135 మంది చనిపోయిన విషాదకర సంఘటన తర్వాత మోర్బీ పట్టణం ఇప్పటి వరకు కోలుకోలేదు. దాదాపు ప్రజలెవ్వరూ తమ రోజువారీ కార్యకరమాల్లో లీనం కాలేకపోతున్నారు. వ్యాపారెలెవ్వరూ షాపులు ఓపెన్ చేయలేదు. రెండు రోజులుగా మోర్బీ పట్టణం నిర్జీవంగా...విషాదం ఉట్టిపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రోజు మోర్బీ పట్టణాన్ని ఈ రోజు సందర్శించారు.

మోడీ పర్యటన సందర్భంగా ప్రభుత్వ అధికారులు చేసిన, డ్రామాలు, హడావుడిపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పుమంటున్నాయి. పట్టణంలో మోడీ వెళ్ళే ప్రాంతంలో రోడ్డు పక్కనంతా చెత్త చెదారం కనపడకుండా....పేదరికం కనపదకుండా తెల్ల గుడ్డలు కట్టారు. దానికోసం సోమవారం మొత్తం పనిచేశారు సిబ్బంది. ఇది మోర్బీ పట్టణం యొక్క 'గుజరాత్ మోడల్ అభివృద్ది' డ్రామా...!

దీనిపై ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన దక్ష్ పటేల్ అనే నెటిజన్ ''మోదీ పర్యటనకు ముందు మోర్బీ పట్టణంలో ప్రపంచ స్థాయి అభివృద్ధిని దాచడానికి తెల్లటి గుడ్డ కప్పారు.'' అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అనేక మంది ప్రముఖులు, జర్నలిస్టులు రీ ట్వీట్ చేశారు.

ఇక ఆస్పత్రిలో అయితే అధికారులు చేసిన పనులు చూసి సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. నిన్నటి దాకా ఏ మాత్రం సౌకర్యాలు లేని ఆస్పత్రి.... పాడైపోయి పెచ్చులూడుతున్న పాత గోడలు... సరైన బెడ్లు లేవు.... బెడ్ షీట్లు చూసి అక్కడి రోగులు చాలా కాలమే అయ్యింది....నీళ్ళ కనెక్షన్లు లేవు... పాడుబడిపోయిన మరుగుదొడ్లు... రోగులుండే హాళ్ళలో ఫ్యామ్లు లేవు. ఉన్నా అవి తిరగక చాలా కాలమే అయ్యింది.

ఇటువంటి ఆస్పత్రి తీరు ఈ రోజుమారిపోయింది. ఖాళీగా ఉన్న ఓ వార్డును శుభ్రం చేశారు. దానికి పేయింటేశారు. అందంగా తీర్చి దిద్దారు. కొత్త‌ బెడ్లు వచ్చాయి.వేరే ఆస్పత్రుల నుంచి బెడ్ద్ షీట్లు వచ్చాయి... వేరే రూముల్లో ముక్కుతూ మూలుగుతూ ఉన్న బ్రిడ్జి కొలాప్స్ బాధితులను ఈ వార్డులోకి మార్చారు. రాత్రికి రాత్రి మరుగు దొడ్లు బాగయిపోయాయి. నీళ్ళ కనెక్షన్లు వచ్చాయి. ఆ వార్డులో నాలుగు వాటర్ కూలర్ లు వచ్చాయి. ఇవన్నీ ఆ ఒక్క వార్డుకుకు వచ్చిన సౌకర్యాలు మాత్రమే. వీటి కోసం దాదాపు 50 మంది ఒకరోజంతా పని చేశారు. ప్రధాని మోడీ ఈ ఒక్క వార్డును మాత్రమే సందర్శించారు. ఆ ఆస్పత్రి సిబ్బంది ఎంపిక చేసిన రోగులతో మోడీ మాట్లాడారు. ఇది మోర్బీ పట్టణ ప్రభుత్వ ఆస్పత్రి యొక్క‌ 'గుజరాత్ మోడల్ అభివృద్ది' డ్రామా

దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ట్వీట్ లో విమర్శలు గుప్పించింది.

''మోడీ ఆస్పత్రిలో జరగనున్న ప్రధాని ఫోటోషూట్‌కి ఎలాంటి లోటు రాకూడదని ఆసుపత్రికి మరమ్మతులు చేస్తున్నారు.

27 ఏళ్లుగా బీజేపీ పని చేసి ఉంటే ఇలా అర్ధరాత్రి ఆస్పత్రిలో పనులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు.'' అని ఆప్ ట్వీట్ చేసింది.

ఇక వంతెన కూలిపోయిన ప్రాంతాన్ని కూడా ప్రధాని సందర్శించారు. ప్రమాదం జరిగిన విధానం అధికారులు ఆయనకు వివరించారు. అక్కడ ఓ పిల్లర్ కు, ఆ బ్రిడ్జి పునర్నిర్మాణం పనులు చేసిన ఒరేవా కంపెనీకి చెందిన పెద్ద బోర్డు ఉంది. ఆ బోర్డును అధికారులు పెద్ద తెల్ల గుడ్డతో కప్పేశారు. మోడీ చూస్తారనా లేక ఆయనతో వచ్చిన మీడియా కెమెరాలు చూస్తాయనా తెలియదు. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే ఛానల్ ఎడిటర్ రాజ్ దీప్ సర్ దేశాయ్ ట్విట్టర్ లో స్పందిస్తూ ..

''ప్రధానమంత్రి సందర్శనకు ముందు మోర్బిలోని ప్రమాద స్థలంలో 'ఓరెవా' కంపెనీ బ్యానర్ ను కప్పేశారు. దీనివలె నిజంపై కూడా ముసుగు కప్పబడదని ఆశిద్దాం'' అని ట్వీట్ చేశారు.

నిర్మాణ రంగంలో ఏ మాత్రం అనుభవం లేని ఓరెవా అనే కంపెనీకి బ్రిడ్జి పునర్నిర్మాణం, 15 ఏళ్ళ నిర్వాహణ కాంట్రాక్టును అప్పజెప్పిన ప్రభుత్వం.... డబ్బుల కోసం వందేళ్ళు దాటిన ఆ బ్రిడ్జిపైకి ఒకే సారి 500 మందికి పైగా జనాలను అనుమతించిన కంపెనీ.... ప్రమాదం జరిగి 35 మంది మరణించి 170 మందికి పైగా గాయాలపాలయ్యాక తమకేమీ సంబంధంలేదని చేతులు దులుపుకున్న గుజరాత్ ప్రభుత్వం.....

ఈ పాపాల మీద తెల్ల గూడ్డలు కప్పడం, పేయింటింగులు వేయడమేనా గుజరాత్ మోడల్ అభివృద్ది అంటే ?.

First Published:  1 Nov 2022 3:36 PM GMT
Next Story