Telugu Global
National

గుజరాత్ లో దీపావళి రోజున మత ఘర్షణ

దీపావళి రోజున గుజరాత్ లోని వడోదరలో మత ఘర్షణలు జరిగాయి. నగరంలో మతపరంగా సున్నితమైన ప్రాంతంలో అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో క్రాకర్లు పేల్చడంతో ఘర్షణకు దారితీసింది.

గుజరాత్ లో దీపావళి రోజున మత ఘర్షణ
X

దీపావళి రోజున వడోద‌ర లోని పానిగేట్ ప్రాంతంలో మత ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రెండు వర్గాలకు చెందిన 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల స‌మాచారం మేర‌కు, నగరంలో మతపరంగా సున్నితమైన ప్రాంతంలో క్రాకర్లు పేల్చడంతో ఘర్షణకు దారితీసింది. అర్ధరాత్రి 12.45 గంటల ప్రాంతంలో మొద‌లైన ఈ ఘర్షణలో ఎవరికీ పెద్ద‌గా గాయాలు కాక పోవ‌డం కొంత ఊర‌ట అని చెబుతున్నారు. ఘర్షణ అనంతరం ఓ భవనంలోని మూడో అంతస్తు నుంచి పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో

ఇరువర్గాలు పరస్పరం రాకెట్ బాంబులు విసురుకున్నాయని పోలీసులు తెలిపారు. ఆ తరువాత, ఈ రెండు వ‌ర్గాలు ఒక‌రి పై ఒక‌రు రాళ్ళు విసురుకుంటూ పోరాటంగా మార్చారు. పోలీసులు జోక్యం చేసుకుని పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పానిగేట్‌లోని ముస్లిం మెడికల్ సెంటర్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు డీసీపీ యశ్‌పాల్ జగనియా తెలిపారు. ఈ ప్రాంతం మ‌త‌ప‌రంగా చాలా సున్నిత‌మైన ఏరియా అని చెప్పారు. ఈ ఘ‌ర్ష‌ణ సంద‌ర్భంగా కొన్ని వాహ‌నాలను త‌గ‌ల‌బెట్టార‌ని చెప్పారు.

"వడోదరలోని పానిగేట్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. దుకాణాలను కూడా ధ్వంసం చేశారు," అని డిసిపి తెలిపారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణ పడిన వర్గాల వారిని శాంతింపజేశారు. పెట్రోలింగ్‌లో ఉన్న వారిపై కూడా పెట్రోల్ బాంబు విసిరారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించి, ఘర్షణకు దారితీసిన కారణాలను తెలుసుకుంటున్నారు.

First Published:  25 Oct 2022 9:42 AM GMT
Next Story