Telugu Global
National

డ్రగ్ డీలర్‌గా మారిన కెమికల్ ఇంజినీర్‌, రూ.500 కోట్ల ముడి స‌రుకు స్వాధీనం

ఒకేఒక కంపెనీ వీరికి డ్రగ్స్ తయారు చేసేందుకు ముడి స‌రుకు మొత్తాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 14 కిలోల మెఫెడ్రోన్, 4.3 కిలోల కెటామైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ డీలర్‌గా మారిన కెమికల్ ఇంజినీర్‌, రూ.500 కోట్ల ముడి స‌రుకు స్వాధీనం
X

ఒక కెమికల్ ఇంజినీర్‌కు డ్రగ్స్ గురించి పూర్తి విషయాలు తెలిసుంటాయి. ఆ జ్ఞానం ఉన్న వారు ముడి పదార్థాల నుంచి కొత్త పదార్థాలను అవసరాలకు తగినట్టుగా తయారు చేస్తారు. అయితే తన తెలివిని ఉపయోగించి ముడి పదార్థాల నుంచి మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి నుంచి పోలీసులు రూ. 500 కోట్ల విలువైన‌ డ్రగ్స్ ముడి స‌రుకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన జితేష్ హిన్హోరియా గుజరాత్‌లోని సూరత్‌లో నివసిస్తున్నాడు. ఇతను ఒకప్పుడు ఫార్మా ఉద్యోగి. ప్రస్తుతానికి కెమికల్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు. అయితే జితేష్ కెటామైన్, మెఫెడ్రోన్, కొకైన్ లను ఉపయోగించి డ్రగ్స్ తయారు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా జితేష్ వద్ద మొత్తం 23 వేల లీటర్ల ముడిస‌రుకు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ముడి స‌రుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టారు. జితేష్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి డ్రగ్స్ తయారు చేసి దేశంలోని పలు నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

అయితే ఒకేఒక కంపెనీ వీరికి డ్రగ్స్ తయారు చేసేందుకు ముడి స‌రుకు మొత్తాన్ని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 14 కిలోల మెఫెడ్రోన్, 4.3 కిలోల కెటామైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అహ్మదాబాద్ డ్రగ్స్ జోనల్ యూనిట్, క్రైమ్ బ్రాంచ్, అహ్మదాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వ‌హించిన ఆపరేషన్‌లో నిందితుడు ప‌ట్టుబ‌డ్డాడు. జితేష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అలాగే అరెస్ట్ అయిన మరో ఇద్దరు నిందితుల నివాసాల్లో కూడా సోదాలు చేయగా వారి వద్ద 23 కిలోల కొకైన్, 2.9 కిలోల మెఫెడ్రోన్, రూ. 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గత రెండేళ్లుగా జితేష్ ముంబై, రత్లాం, ఇండోర్, ఢిల్లీ, చెన్నై, సూరత్ నగరాల‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

First Published:  24 Oct 2023 9:26 AM GMT
Next Story