Telugu Global
National

గుజరాత్ లో బ్రిడ్జి కొలాప్స్ : 140కి చేరిన మృతుల సంఖ్య‌

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 140కి చేరింది. మరో 200 మందిని రక్షించి ఆస్పత్రుల్లో చేర్చినట్టు అధికారులు చెప్పారు.

గుజరాత్ లో బ్రిడ్జి కొలాప్స్ : 140కి చేరిన మృతుల సంఖ్య‌
X

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై నిన్న సాయంత్రం కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన సంఘటనలో గంట గంటకూ మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 140 మంది మృతదేహాలను బైటికి తీసినట్టు రాజ్‌కోట్ రేంజ్ ఐజీ అశోక్ యాదవ్ తెలిపారు.

దాదాపు 100 ఏళ్ళక్రితం కట్టిన ఈ కేబుల్ బ్రిడ్జి కొద్ది రోజుల క్రితం పాడయిపోవడంతో దానికి రిపేర్లు చేసి నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభించారు. నిన్న ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు ఆ బ్రిడ్జి పైకి చేరుకున్నారు. దాదాపు 400 మందికి పైగా సందర్శకులు ఆ బ్రిడ్జిపై ఉండగా అది కుప్పకూలిపోయింది.

నిన్న రాత్రి నుండే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, ఆర్మీ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మందిని రక్షించి ఆస్పత్రుల్లో చేర్చినట్టు అధికారులు చెప్పారు.

కాగా కేబుల్ బ్రిడ్జీని తిరిగి ప్రారంభించడానికి తాము అనుమతి ఇవ్వలేదని, తమ అనుమతి లేకుండానే తెరిచారని మోర్బీ మున్సిపల్ చీఫ్ ఆఫీసర్ సందీప్ సింగ్ ఝూలా చెప్పారు.

మరో వైపు ఈ సంఘటన‌పై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. మోర్బీ మునిసిపల్ చీఫ్ ఆఫీసర్‌ అధికారిక అనుమతి లేకుండా తీగల వంతెన ఎలా తెరిచారు? 140 మంది మరణించడానికి,మరో 100 మందికి పైగా గాయపడటానికి ఎవరు బాధ్యులు?అని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా ష్రినేట్ ప్రశ్నించారు.

First Published:  31 Oct 2022 3:01 AM GMT
Next Story