Telugu Global
National

బిల్కిస్ బానో కేసు: అత్యాచారం, హత్య కేసులో దోషులు బీజేపీ MP, MLAలతో చెట్టాపట్టాల్

మార్చి 25, శనివారం, గుజరాత్‌లోని దాహోద్ లో గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ ను ప్రారంభించిన కార్యక్రమంలో వేదికపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి, జస్వంత్‌సిన్హ్ భాభోర్, ఎమ్మెల్యే శైలేష్‌భాయ్ భభోర్ లతో పాటు బిల్కిస్ బానో అత్యాచారం, 14 మంది ఆమె బంధువులను హత్య చేసిన కేసులో దోషి అయిన శైలేష్ భట్ కూడా ఉన్నారు.

బిల్కిస్ బానో కేసు: అత్యాచారం, హత్య కేసులో దోషులు బీజేపీ MP, MLAలతో చెట్టాపట్టాల్
X

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని 14 మంది సభ్యులను - ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా - హత్య చేసినందుకు దోషులుగా తేలిన భట్ , మరో 10 మంది వ్యక్తులను గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే.

విడుదలైన సమయంలోనే ఆ నేరస్తులకు బీజేపీ నాయకులు స్వాగత సత్కారాలు చేశారు. దేశ‌సవ్యాప్తంగా ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ నాయకులు వారిని తలకెత్తుకున్న విధాన‍ం అప్పుడే దేశం మర్చిపోదుకూడా.

ఇక ఇప్పుడు ఆ హంతకులతో బీజేపీ నాయకులు చెట్టాపట్టాలేసుకొని తిరగడమే కాదు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆ హంతకులను తమతోపాటు వేదికలెక్కిస్తున్నారు. మార్చి 25, శనివారం, గుజరాత్‌లోని దాహోద్ లో గ్రూప్ వాటర్ సప్లై స్కీమ్ ను ప్రారంభించిన కార్యక్రమంలో వేదికపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి, జస్వంత్‌సిన్హ్ భాభోర్, ఎమ్మెల్యే శైలేష్‌భాయ్ భభోర్ లతో పాటు బిల్కిస్ బానో అత్యాచారం, 14 మంది ఆమె బంధువులను హత్య చేసిన కేసులో దోషి అయిన శైలేష్ భట్ కూడా ఉన్నారు. వీరందరూ కలిసి ఫోజులిచ్చిన ఫోటోలను ఎంపీ జస్వంత్‌సిన్హ్, ఎమ్మెల్యే శైలేష్‌భాయ్ భభోర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈ కార్యక్రమంలో సింగ్వాడ్ తాలూకా పంచాయితీ ప్రముఖ్ కాంతబెన్ దామోర్,దాహోద్ జిల్లా పంచాయితీ అప్-ప్రముఖ్ రతన్ భాయ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

బిల్కిస్ బానో భర్త యాకూబ్ రసూల్ ఓ ప్రముఖ వెబ్ పోర్టల్ తో మాట్లాడుతూ, ఆ ఫోటోలు చూసి ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. "ఈ వ్యక్తులను జైలు నుండి బయటకు వచ్చిన క్షణంలోనే సత్కరించారు. వారు అధికారంలో ఉన్నవారితో వేదికను పంచుకోవడం మాకు ఆశ్చర్యం కలిగించదు. ఇప్పుడు న్యాయం కోసం మా ఏకైక ఆశ సుప్రీంకోర్టు మాత్ర‌మే" అని ఆయన అన్నారు.

దోషులు విడుదలైన తర్వాత, దోషులను విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం ఉందని సుప్రీంకోర్టు మే 2022 నాటి ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ బిల్కిస్ బానో పిటిషన్ దాఖలు చేశారు.

మార్చి 24న భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పిటిషన్‌పై విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ రోజు ఈ పిటిషన్ విచారణకు రానుంది.

First Published:  27 March 2023 1:57 AM GMT
Next Story