Telugu Global
National

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 77మందికి పైగా మృతి!

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 77 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. ఈ రోజు సాయంత్రం 400 మంది సందర్శకులు బ్రిడ్జిపై ఉండగా ఒక్క సారి బ్రిడ్జి కుప్పకూలింది. దాంతో 400 మంది నదిలో పడిపోయారు.

గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలి 77మందికి పైగా మృతి!
X

గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై దాదాపు 100 ఏళ్ల కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కూలి 77 మందికి పైగా మరణించారు. వందల మంది గాయాలపాలైనట్టు సమాచారం.

ప్రాథమిక నివేదికల ప్రకారం, కేబుల్ బ్రిడ్జి పాడ‌వడంతో బాగు చేసిన తర్వాత మూడురోజుల క్రితమే తిరిగి ప్రారంభించారు. ఈ రోజు ఆదివారం కావడంతో 400 మందికి పైగా సందర్శకులు ఆబ్రిడ్జిపైకి చేరుకున్నారు. హటాత్తుగా వంతెన కూలిపోవడంతో దానిపైన ఉన్న జనమంతా నదిలో పడిపోయారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి ఇప్పటికే మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపినట్లు డిజి ఎన్‌డిఆర్‌ఎఫ్ అతుల్ కర్వాల్ తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.


తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. IAS అధికారి, AMC కమీషనర్ రాజ్‌కుమార్ బెనివాల్, గాంధీనగర్‌లోని రోడ్ అండ్ బిల్డింగ్‌లోని నాణ్యత నియంత్రణ విభాగం చీఫ్ ఇంజనీర్ KM పటేల్, LD ఇంజనీరింగ్ కళాశాల డాక్టర్ గోపాల్ ట్యాంక్, సెక్రటరీ రోడ్ అండ్ హౌసింగ్ సందీప్ వాసవ,CID (క్రైమ్) IG సుభాష్ త్రివేదితో పాటు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం HOD కమిటీలో ఉన్నారు.


ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ట్వీట్ చేశారు, "మోర్బీలో సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన విషాదం పట్ల నేను చాలా బాధపడ్డాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించాలని సూచనలు చేశారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను.'' అని సీఎం ట్వీట్ చేశారు.

గాయపడిన వారికి తక్షణమే చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం భూపేందర్ పటేల్ తెలిపారు. మృతుల కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ప్రకటించింది ప్రభుత్వం.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం గుజరాత్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ , ప్రమాదం గురించి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో మాట్లాడారు.

సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇది రాసే సమయానికి రెస్క్యూ టీం స‌గం మందిని కూడా బైటికి తీసుకరాలేకపోయారని తెలుస్తోంది. .


కాగా గుజరాత్ లో బ్రిడ్జి కూలి సందర్శకులు చనిపోయిన సంఘటన‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ధిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి అని ట్వీట్ చేశారు.


First Published:  30 Oct 2022 5:57 PM GMT
Next Story