Telugu Global
National

పేయింగ్ గెస్ట్(పీజీ)లపై జీఎస్టీ పిడుగు..

అద్దెకు తీసుకునే ఇళ్లపై జీఎస్టీ ఉండదు, ఎందుకంటే అందులో కిచెన్ ఉంటుంది కాబట్టి. పీజీలలో వ్యక్తిగతంగా ఎవరికీ వంటగది ఉండదు కాబట్టి 12శాతం జీఎస్టీ కట్టాల్సిందేనంటోంది AAR.

పేయింగ్ గెస్ట్(పీజీ)లపై జీఎస్టీ పిడుగు..
X

పేయింగ్ గెస్ట్ లు గా పీజీ రూమ్స్ లో ఉండేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. పీజీలపై 12శాతం జీఎస్టీ విధించేందుకు రంగం సిద్ధమైంది. ఉదాహరణకు మీరు నెలకు 6వేల రూపాయలు చెల్లిస్తూ పీజీలో ఉన్నారనుకుందాం. ఇకపై జీఎస్టీతో కలిపి 6720 రూపాయలు చెల్లించుకోవాలి. అదనంగా కట్టే జీఎస్టీ కేంద్రం ఖాతాలో పడుతుంది. అసలింతకీ సడన్ గా పీజీలపై ఈ జీఎస్టీ భారం ఎందుకు వేశారు..? ఏంటి కథ..?

సాధారణ హోటళ్లు, లాడ్జిలనుంచి వాటి అద్దె ప్రాతిపదికన జీఎస్టీ వసూలు చేస్తారు. అయితే పీజీల విషయంలో ఇప్పటి వరకూ మినహాయింపు ఉంది. దీనిపై కొంతకాలంగా చర్చ జరుగుతుండటంతో పీజీల విషయంపై విచారణ మొదలైంది. బెంగళూరులో అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (AAR) పీజీలకు కూడా జీఎస్టీ చెల్లించాల్సిందేనంటూ ఆదేశాలిచ్చింది. అటు లక్నోలో కూడా AAR ఇలాంటి ఆదేశాలివ్వడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు పీజీలపై జీఎస్టీ చర్చనీయాంశమైంది.

జీఎస్టీ ఎందుకు..?

అద్దెకు తీసుకునే ఇళ్లపై జీఎస్టీ ఉండదు, ఎందుకంటే అందులో కిచెన్ ఉంటుంది కాబట్టి. పీజీలలో వ్యక్తిగతంగా ఎవరికీ వంటగది ఉండదు కాబట్టి 12శాతం జీఎస్టీ కట్టాల్సిందేనంటోంది AAR. జీఎస్టీ చట్టంలోని ఈ చిన్న లొసుగు ఉపయోగించి పన్నుపోటునుంచి తప్పించుకోలేకుండా చేసింది.

పీజీల నిర్వాహకుల ఆవేదన..

కరోనా టైమ్ లో పీజీల వ్యాపారం బాగా దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇటీవల పీజీల అద్దెలు కూడా పెంచారు. మళ్లీ ఇప్పుడు జీఎస్టీ అంటూ అద్దె పెంచితే గిరాకీ తగ్గిపోతుందని భావిస్తున్నారు నిర్వాహకులు. దాని బదులు బ్యాచ్ లర్స్ అద్దె ఇళ్లకు అలవాటు పడితే పీజీల వ్యాపారం తగ్గిపోతుందనేది వారి ఆందోళనకు కారణం. అందుకే ఈ జీఎస్టీ భారం తగ్గించాలంటున్నారు హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. AAR తీర్పుపై అప్పిలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (AAAR)కి అప్పీల్ చేస్తామంటున్నారు.

First Published:  31 July 2023 12:19 PM GMT
Next Story