Telugu Global
National

వేళకి వరుడు రాలేదని బావతో పెళ్ళి .. అంత తొందర ఎందుకంటే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో ఓ వింతైన ఘటన చోటుచేసుకుంది. ముహూర్తం సమయానికి వరుడు రాలేదని.. వధువు అప్పటికే పెళ్ళయి పిల్లలున్న తన బావను పెళ్లాడింది.

వేళకి వరుడు రాలేదని బావతో పెళ్ళి .. అంత తొందర ఎందుకంటే..
X

సాధారణంగా ఏదన్నా పెళ్ళికి బంధువులు ఆ సమయానికి వెళ్లిన పర్వాలేదు గానీ, వరుడు వధవు ముందే ఉంటారు. ఉండాలి కూడా. అనుకోని పరిస్థితులలో ఎవరైనా వరుడు గాని వధువు గాని లేట్ అయితే ఏం చేస్తారు.. దగ్గరలో ఉన్న వేరే ముహూర్తం చూసి మూడు ముళ్ళు వేయించేస్తారు. లేదంటే ముహూర్తానిది ఏముంది అంతా మనం పెట్టుకున్నదే కదా అని చెప్పి ఆ ఇద్దరికీ పెళ్ళి చేస్తారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో ఓ వింతైన ఘటన చోటుచేసుకుంది. ముహూర్తం సమయానికి వరుడు రాలేదని.. వధువు అప్పటికే పెళ్ళయి పిల్లలున్న తన బావను పెళ్లాడింది. అది ప్రేమతోనో, పరువు పోతుందనో కాదు.. ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం.. అసలేం జరిగింది అంటే ..

సీఎం సామూహిక వివాహ పథకం కింద యూపీ ప్రభుత్వం నూతన దంపతులకు రూ.51 వేల చొప్పున ఇస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలకు పెళ్లిళ్లయ్యాయి. ఈ సామూహిక వివాహంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. ఝాన్సీ సమీప బామౌర్‌కు చెందిన ఖుషీకి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృష్‌ భానుతో పెల్లి నిశ్చయమైంది. వీళ్లు కూడా సామూహిక వివాహ కార్యక్రమానికి పేరు నమోదుచేసుకున్నారు. వీరిద్దరి పేరుతో పెళ్ళికి రిజిస్ట్రేషను కూడా అయ్యింది. అయితే, పెళ్లిపీటల మీద ఖుషీ పక్కన కూర్చున్న వరుడు, ఫోటోలో ఉన్న వ్యక్తి వేర్వేరుగా ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఆరా తీయగా పెళ్లికొడుకు వేళకు రాలేదని తేలింది. దీంతో, పెద్దల సలహా మేరకు తాను కూర్చున్నట్టు నకిలీ వరుడు చెప్పాడు. తనకు ఇదివరకే పెళ్లి అయ్యిందని, ఖుషీకి వరుసకు బావ అవుతానని చెప్పడంతో అధికారులు షాకయ్యారు. ఈ ఘటనపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక, ప్రభుత్వం అందజేసిన కానుకలను ఖుషీ కుటుంబసభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆమె తెలిపారు.

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సీఎం సామూహిక వివాహ పథకం కింద మొత్తం రూ.51,000 అందజేస్తోంది. ఇందులో రూ.35,000 నేరుగా వధువు బ్యాంకులో ఖాతాలో జమచేస్తారు. రూ.10,000 కొత్త కాపురానికి అవసరమైన సామాగ్రి, రూ.6,000 వివాహ కార్యక్రమానికి చెల్లిస్తారు.


మొన్న జనవరి 25న బలియా జిల్లాలో మణియార్ కాలేజీలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలోనూ నకిలీ పెళ్లిళ్లు జరిగినట్టు వెల్లడైన విషయం తెలిసిందే. ఇందులో 568 జంటలు పెళ్లి చేసుకోగా.. డబ్బులు తీసుకున్న కొందరు వ్యక్తులు వధూవరులుగా నటించారు. పెళ్లికుమారులు తగినంత మంది లేకపోవడంతో కొందరు పెళ్లికుమార్తెలు వారి మెడలో వారే పూలదండలు వేసుకున్నారు.

First Published:  29 Feb 2024 6:37 AM GMT
Next Story