Telugu Global
National

సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. బలపరీక్ష జరిగేనా..?

అసెంబ్లీ సమావేశాల్లో జరిగే కార్యక్రమాల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కి ముందుగానే ఇస్తుందా..? అందులో బలపరీక్ష ఉంటే, దానికి గవర్నర్ అంగీకరిస్తారా..? అనేది తేలాల్సి ఉంది.

సమావేశాలకు గ్రీన్ సిగ్నల్.. బలపరీక్ష జరిగేనా..?
X

ఎట్టకేలకు పంజాబ్ గవర్నర్ దిగొచ్చారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు అనుమతి ఇచ్చారు. ఆపరేషన్ కమల్ విఫలమైందని చెబుతూ పంజాబ్ లో సీఎం భగవంత్ మాన్ బలపరీక్షకు సిద్ధమైన వేళ.. ఈనెల 22న జరగాల్సిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ అడ్డుపుల్ల వేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టడం, ఒత్తిడి పెంచడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు. మంగళవారం పంజాబ్ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచేందుకు ఆయన అంగీకరించారు. అయితే అసెంబ్లీ సెషన్ కార్యక్రమాలకు సంబంధించిన జాబితాను గవర్నర్ కోరడం విశేషం. ఇలా జాబితాను కోరడంపై పంజాబ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది.

అసెంబ్లీ సమావేశాల్లో కార్యక్రమాల జాబితాను గవర్నర్ కు ముందస్తుగా ఇవ్వడం ఆనవాయితీ. ఒకవేళ జాబితా ఇవ్వడం ఆలస్యమైనా గవర్నర్లు పెద్దగా జోక్యం చేసుకోరు. కానీ తొలిసారిగా గవర్నర్ తనకు తానే కార్యక్రమాల వివరాలు అడగడం ఇక్కడ విశేషం. దీనిపై సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. దేశ చరిత్రలోనే ఇదో కొత్త సంప్రదాయం అని విమర్శించారాయన.

బలపరీక్ష ఉంటుందా, లేదా..?

బలపరీక్ష ఉంటుందా, లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. కార్యక్రమాల వివరాలు గవర్నర్ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. తమమీద దయతో ఈ సమావేశాలకు అనుమతిచ్చిన గవర్నర్ కి ధన్యవాదాలంటూ స్పీకర్ కల్తార్ సింగ్ వెటకారంగా ట్వీట్ చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మరింత చర్చ నడుస్తోంది. సమావేశాల్లో జరిగే కార్యక్రమాల జాబితాను ప్రభుత్వం గవర్నర్ కి ముందుగానే ఇస్తుందా..? అందులో బలపరీక్ష ఉంటే, దానికి గవర్నర్ అంగీకరిస్తారా..? అనేది తేలాల్సి ఉంది. మంగళవారం జరగబోతున్న పంజాబ్ అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  25 Sep 2022 7:14 AM GMT
Next Story