Telugu Global
National

మిజోరంలో జీపీఎం సంచలన విజయం

ప్రస్తుత సీఎం జోరమంగాపై అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించడంలో జీపీఎం సఫలీకృతమైంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, లౌకికవాదాన్ని విస్తరించటం, ప్రాంతీయ మైనారిటీలకు రక్షణ కల్పించడం తమ ప్రాధాన్యతలుగా ప్రచారం చేసింది.

మిజోరంలో జీపీఎం సంచలన విజయం
X

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జీపీఎం సంచలన విజయం సాధించింది. 27 సీట్లతో స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. అధికార ఎంఎన్‌ఎఫ్‌ 10 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీకి 2, కాంగ్రెస్‌కి ఒక స్థానం మాత్రమే దక్కాయి. మిజోరం అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 21. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ నిర్వహించగా, 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

6 పార్టీల కూటమిగా ఏర్పడి...

రాష్ట్రంలోని జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌(జీపీఎం) ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్‌ కాన్ఫరెన్స్, జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ, జోరామ్‌ ఎక్సోడస్‌ మూవ్‌మెంట్, జోరామ్‌ డీసెంట్రలైజేషన్‌ ఫ్రంట్, జోరామ్‌ రిఫార్మేషన్‌ ఫ్రంట్, మిజోరం పీపుల్స్‌ పార్టీ ఉన్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి జేడీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. జీపీఎంని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే లల్దుహోమ జీపీఎం పార్టీని స్థాపించారు. ఆయనే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పోటీలో నిలిచారు.

ప్రస్తుత సీఎం జోరమంగాపై అవినీతి ఆరోపణలను ప్రజలకు వివరించడంలో జీపీఎం సఫలీకృతమైంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని, లౌకికవాదాన్ని విస్తరించటం, ప్రాంతీయ మైనారిటీలకు రక్షణ కల్పించడం తమ ప్రాధాన్యతలుగా ప్రచారం చేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌ 2018లో 26 స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో అది 10 స్థానాలకు పరిమితమైంది.


First Published:  4 Dec 2023 1:04 PM GMT
Next Story