Telugu Global
National

ఏప్రిల్ 1 నుంచి ఆ వాహ‌నాల‌కు నో రిజిస్ట్రేష‌న్‌

ప్రాథ‌మిక రిజిస్ట్రేష‌న్ న‌మోదై 15 ఏళ్లు పూర్త‌యిన వాహ‌నాల‌ను వ‌దిలించుకోవాల‌ని, వాటిని చ‌ట్ట‌ప్ర‌కారం రిజిస్ట‌రైన వాహ‌న తుక్కు ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌ర‌లించాల‌ని మంత్రిత్వ శాఖ త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. సైనిక వాహనాలకు మాత్రం మిన‌హాయింపు ఇచ్చింది.

ఏప్రిల్ 1 నుంచి ఆ వాహ‌నాల‌కు నో రిజిస్ట్రేష‌న్‌
X

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన వాహ‌నాల‌కు ప‌దిహేనేళ్ల కాల‌ప‌రిమితి దాటితే.. వాట‌న్నింటినీ వ‌చ్చే ఏప్రిల్ 1 నుంచి తుక్కుగా ప‌రిగ‌ణించ‌నున్నారు. వాటి రిజిస్ట్రేష‌న్ల‌ను కూడా ఉప‌సంహ‌రించ‌నున్నారు. ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన బ‌స్సుల‌కూ ఈ నిబంధ‌న వ‌ర్తించ‌నుంది. రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ తాజాగా దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

ప్రాథ‌మిక రిజిస్ట్రేష‌న్ న‌మోదై 15 ఏళ్లు పూర్త‌యిన వాహ‌నాల‌ను వ‌దిలించుకోవాల‌ని, వాటిని చ‌ట్ట‌ప్ర‌కారం రిజిస్ట‌రైన వాహ‌న తుక్కు ప‌రిశ్ర‌మ‌ల‌కు త‌ర‌లించాల‌ని మంత్రిత్వ శాఖ త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. 2021-22 బ‌డ్జెట్‌లోనే కేంద్రం ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించింది. 2022 ఏప్రిల్ 1 నుంచే ఈ పాల‌సీ అమ‌లులోకి రాగా, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నిర్దిష్టంగా అమ‌లు చేయ‌నున్నారు. రిజిస్ట్రేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించ‌నున్నారు.

ప్ర‌తి 150 కిలోమీట‌ర్ల‌కూ ఒక తుక్కు కేంద్రం...

కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీ దీనిపై స్పందిస్తూ ప్ర‌తి 150 కిలోమీట‌ర్ల‌కూ ఒక వాహ‌న తుక్కు కేంద్రం ఏర్పాటు ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. ద‌క్షిణాసియా ప్రాంతంలో మ‌న దేశం పాత వాహ‌నాల తుక్కు మార్పిడి కేంద్రంగా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

కొత్త పాల‌సీ ప్ర‌కారం పాత వాహ‌నాల‌ను తుక్కుగా మార్చిన త‌ర్వాత వాటి య‌జ‌మానులు కొనుగోలు చేసే కొత్త వాహ‌నాల‌కు ర‌హ‌దారి ప‌న్నులో 25 శాతం రాయితీ ఇవ్వాల‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం సూచించింది. సైన్యం, శాంతిభ‌ద్ర‌త‌లు, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త వంటి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాల కోసం వినియోగించే వాహ‌నాల‌కు మాత్రం ఈ నిబంధ‌న‌ల అమలులో మిన‌హాయింపు ఉంది.

First Published:  20 Jan 2023 5:28 AM GMT
Next Story