Telugu Global
National

ఇకపై ప్రభుత్వ కనుసన్నల్లో మన వాట్సప్ మెసేజ్ లు, కాల్స్?

వాట్సప్, సిగ్నల్ తదితర మేసేజింగ్ యాప్స్ నుండి మనం చేస్తున్న మెసేజులు, కాల్స్ ఇకపై ప్రభుత్వం తన నియంతరణలోకి తీసుకునేందుకు రంగం సిద్దం చేసింది. దీనికి సంబంధించి ముసాయిదాబిల్లును ప్రభుత్వ ప్రజల అభిప్రాయం కోసం విడుదల చేసింది.

ఇకపై ప్రభుత్వ కనుసన్నల్లో మన వాట్సప్ మెసేజ్ లు, కాల్స్?
X

ఇప్పటి వరకు, వాట్సప్, సిగ్నల్, టెలీగ్రామ్ తదితర మేసెజ్ యాప్స్ లో మనం పంపే మెసేజ్ లు వ్యక్తి నుంచి వ్యక్తికి ఎన్‌క్రిప్ట్ చేయబడినవి. వాటిని ఆ ఇద్దరు తప్ప మరెవరూ చూడలేరు. అయితే ఎప్పటి నుంచో దీని మీద కన్నేసిన కేంద్ర ప్రభుత్వం అందులో వేలుపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఆ నేపథ్యంలోనే పెగాసిస్ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఏకంగా చట్టం చేసి మన వాట్సప్ లోకి దూరిపోవడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది.

కేంద్ర ప్రభుత్వం బుధవారం అర్ద రాత్రి ప్రచురించిన టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదా ప్రకారం, వాట్సాప్ , సిగ్నల్ వంటి ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సర్వీసెస్‌ను అడ్డగించి, విని, పరిశీలించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా బిల్లులోని నిర్వచనం ప్రకారం... టెలికమ్యూనికేషన్ సేవలు అనే పదం పరిధిలోకి ప్రసార సేవలు, ఎలక్ట్రానిక్ మెయిల్, వాయిస్ మెయిల్, వాయిస్, వీడియో, డేటా కమ్యూనికేషన్ సేవలు, ఆడియోటెక్స్ సేవలు, వీడియోటెక్స్ సేవలు,ఫిక్స్ డ్ ఫోన్, మొబైల్ సేవలు, ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలు, ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు, ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు, విమానంలో, సముద్ర కనెక్టివిటీ సేవలు, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ సేవలు, మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ సేవలు, ఓవర్-ది-టాప్ (OTT) కమ్యూనికేషన్ సేవలు ఉన్నాయి.

టెలికమ్యూనికేషన్ సేవలుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ఏదైనా ఇతర సేవను కూడా ప్రభుత్వం ఆ తర్వాత జోడించవచ్చు. ఈ ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని కోరింది.

టెలికమ్యూనికేషన్ కోసం ఉద్దేశించిన డేటా స్ట్రీమ్ లేదా ఇంటెలిజెన్స్ లేదా ఇన్ఫర్మేషన్‌ కూడా మెసేజెస్ పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి అప్లికేషన్ల ద్వారా చేసే వాయిస్, వీడియో కాల్స్‌ను కూడా అడ్డగించి, పరిశీలించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఈ ముసాయిదా బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది.

ముసాయిదాలోని సెక్షన్ 24 ప్రకారం, భారత దేశ సార్వభౌమాధికారానికి లేదా విదేశాలతో సత్సంబంధాలకు లేదా ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి భావిస్తే వాట్సాప్, సిగ్నల్ వంటి ప్లాట్‌ఫారాల ద్వారా చేసుకునే కాల్స్, పంపుకునే మెసేజ్ లను అడ్డగించే అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది.

ఈ బిల్లు యథాతథంగా చట్టంగా మారితే, టెలికాం పరిశ్రమపై ప్రభావం తీవ్రంగా ఉండవచ్చునని నిపుణులు చెప్తున్నారు. ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్‌కు ప్రైవసీ, సెక్యూరిటీ ఉంటాయని ఇప్పటి వరకు ఆయా సంస్థలు ఇస్తున్న భరోసా ఇకపైన ఉండకపోవచ్చు. ఆ మెసేజింగ్ యాప్ లను వాడే వారి వ్యక్తిగత స్వేచ్చకు కూడా ఈ బిల్లు తీవ్ర ముప్పు తీసుకరాబోతుంది. ఈ ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే ఇక వాట్సప్ తదితర మేసేజింగ్ యాప్ ల ద్వారా మనం చేసే మెసేజ్ లు, కాల్ లు ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్ళిపోతాయి. ఇక వ్యక్తులకు వ్యక్తిగత స్పేస్ అనేది లేకుండా పోతుంది.

First Published:  22 Sep 2022 11:28 AM GMT
Next Story