Telugu Global
National

సుప్రీం ఆగ్రహించినా.. మారని తమిళనాడు గవర్నర్ తీరు

గవర్నర్ల తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టిన వారం రోజుల్లోనే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీం ఆగ్రహించినా.. మారని తమిళనాడు గవర్నర్ తీరు
X

గవర్నర్లు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాదన్న విషయాన్ని గుర్తెరిగి.. ప్రభుత్వాలకు అనుకూలంగా నడుచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన వారం రోజులకే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో బీజేపీ నియమించిన గవర్నర్ ఆర్.ఎన్.రవికి, స్టాలిన్‌ ప్రభుత్వానికి మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. చట్టసభల్లో ఆమోదించి పంపిన 12 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తుండటంతో స్టాలిన్ సర్కార్ ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తోంది.

పంజాబ్ రాష్ట్రంలో కూడా ఆప్ ప్రభుత్వం పంపిన బిల్లులను అక్కడి గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ పెండింగ్ లో పెట్టేశారు. గవర్నర్లు చట్టసభల్లో చేసిన బిల్లులను ఆమోదించడం లేదని ఇటీవల తమిళనాడు, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తమిళనాడు, పంజాబ్ గవర్నర్ల తీరును తప్పు పట్టింది. ప్రభుత్వాలు పంపిన బిల్లులను ఆమోదించకుండా ఇబ్బంది పెట్టడం అసంతృప్తికి గురి చేస్తోందని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది.

గవర్నర్ల తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టిన వారం రోజుల్లోనే తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ కు పంపిన 12 బిల్లుల్లో పది బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లను నియమించడంలో గవర్నర్ కు ఉన్న అధికార పరిధిని తగ్గించడం ఒకటైతే, గత అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను విచారించేందుకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు కూడా ఉన్నాయి.

కాగా, గవర్నర్ తీసుకున్న తాజా నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ చర్యపై శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకే పంపనుంది. కేంద్రంలో బీజేపీ పెద్దల సూచనల మేరకే ఆర్.ఎన్. రవి డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.

First Published:  16 Nov 2023 2:50 PM GMT
Next Story