Telugu Global
National

గుజరాతీలు, రాజస్థానీలే తోపులు.. మహారాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..

ఆ రెండు రాష్ట్రాలవారు ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా మార్చడంలో సహకారం అందించారని చెబుతూ.. పరోక్షంగా మహారాష్ట్ర వ్యక్తులకు మండేలా చేశారు కోష్యారీ.

గుజరాతీలు, రాజస్థానీలే తోపులు.. మహారాష్ట్ర గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
X

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే ముంబైకి అంత సీన్ లేదని అనేశారు. ఆ రెండు రాష్ట్రాలవారు మహారాష్ట్రను విడిచి వెళ్లితే.. ఈ రాష్ట్రంలో డబ్బులు మిగలవంటూ సెటైర్లు వేశారు. మహారాష్ట్రలో ఉన్న డబ్బులకు కారణం ఆ రెండు రాష్ట్రాలవారేనన్నారు. అంతే కాదు ముంబైకి దేశ వాణిజ్య రాజధాని అనే పేరు కూడా పోతుందన్నారు. ఆ రెండు రాష్ట్రాలవారు ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా మార్చడంలో సహకారం అందించారని చెబుతూ.. పరోక్షంగా మహారాష్ట్ర వ్యక్తులకు మండేలా చేశారు కోష్యారీ.

ప్రతిపక్షాల విమర్శలు..

సడన్ గా మహారాష్ట్ర గవర్నర్ వ్యంగ్యోక్తులపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే అధికారంలోకి రావడంతో.. గవర్నర్ ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సాహసించారని, మహారాష్ట్ర ప్రజలను ఆయన తీవ్రంగా అవమానించారని అంటున్నారు విపక్ష నేతలు. మరాఠీలను అవమానానికి గురి చేస్తున్నారని, సీఎం ఏక్ నాథ్ షిండే ఈ వ్యాఖ్యలను ఖండించాలని కాంగ్రెస్, శివసేన నేతలు డిమాండ్ చేశారు.

అప్పట్లో ఉద్ధవ్ తో ఉప్పు - నిప్పు

బీజేపీ హయాంలో మహారాష్ట్ర గవర్నర్ గా వచ్చారు భగత్ సింగ్ కోష్యారీ. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో లాగే ఇక్కడ కూడా గవర్నర్, సీఎం మధ్య పరోక్ష పోరు నడిచింది. కరోనా సమయంలో ఉద్ధవ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు గవర్నర్ కోష్యారీ. లాక్ డౌన్ సడలింపుల విషయంలో పెద్ద గొడవే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏక్ నాథ్ షిండేకి బీజేపీ మద్దతు ఉండటంతో పరిస్థితి మారిందని అనుకున్నారంతా. ఇప్పుడు సడన్ గా గవర్నర్, మరాఠీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడి మరింత మంట రాజేశారు. మరి దీనిపై ఆ రాష్ట్ర సీఎం షిండే ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story