Telugu Global
National

గూగుల్ స్ట్రీట్ వ్యూ.. ఇక‌పై గ్రామాల‌కూ అందుబాటులో..!

విదేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడో అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఈ ఫీచర్‌కి ప్రభుత్వం 2016లో అనుమతులు నిరాకరించింది. 2018లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచగా మరోసారి తిరస్కరణకు గురైంది.

గూగుల్ స్ట్రీట్ వ్యూ.. ఇక‌పై గ్రామాల‌కూ అందుబాటులో..!
X

ఏదైనా అడ్ర‌స్ వెతికేవారు గూగుల్ మ్యాప్స్‌ను ఉప‌యోగించి ఈజీగా అక్క‌డికి చేరుకుంటుంటారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో స్ట్రీట్ వ్యూ ఫీచ‌ర్ కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌ధాన న‌గ‌రాల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫీచ‌ర్‌.. ఇక‌పై దేశంలోని ప్ర‌తి గ్రామంలోనూ అందుబాటులో ఉంటుంద‌ని గూగుల్ వెల్ల‌డించింది. దీంతో గూగుల్ యూజర్లు ప్ర‌తి వీధిలోని ప్ర‌తి ఇంటినీ సులువుగా గుర్తించ‌వ‌చ్చు. దీనివ‌ల్ల అడ్ర‌స్‌లు వెతుక్కోవ‌డం మ‌రింత ఈజీ అవుతుంది.

మనం అడ్రస్ కోసం వెతికే చోట ఉన్న షాపు, ఇల్లు లేదా ఆఫీస్ ను 360 డిగ్రీల కోణంలో చూడొచ్చు. ఒకరకంగా దీన్ని వర్చువల్ ప్రజెంటేషన్‌గా చెప్పొచ్చు. దీంతో యూజర్ ఆ ప్రాంతలో ఉండి.. అక్కడి పరిసరాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పటిదాకా గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ మ‌న దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఎప్పుడో అందుబాటులోకి వ‌చ్చినా...

విదేశాల్లో ఈ ఫీచర్ ఎప్పుడో అందుబాటులో ఉన్నప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఈ ఫీచర్‌కి ప్రభుత్వం 2016లో అనుమతులు నిరాకరించింది. 2018లో గూగుల్ స్ట్రీట్ వ్యూ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచగా మరోసారి తిరస్కరణకు గురైంది. స్ట్రీట్ వ్యూ ఫీచర్ పనోరమిక్ ఫొటోలతో నగరాలు, గ్రామాల్లోని వీధులను చూడొచ్చు. దీనివల్ల ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్యకు పరిష్కారంగా స్ట్రీట్ వ్యూ కోసం సేకరించే పనోరమిక్ ఫొటోల్లోని వ్యక్తుల ముఖాలు, వాహనాల నంబర్ ప్లేట్లు వంటి వాటిని కనపడకుండా చేస్తామని తెలిపింది. దీంతో గూగుల్ స్ట్రీట్ వ్యూను ప్రభుత్వం ఆమోదించడంతో గతేడాది ఈ ఫీచర్‌ను గూగుల్ భారత్‌లోని యూజర్లకు పరిచయం చేసింది. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉప‌యోగించ‌డం ఇలా...

మొబైల్ లేదా కంప్యూట‌ర్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తామ‌నే విష‌యం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్ ద్వారా స్ట్రీట్ వ్యూ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పై భాగంలో చతురస్రాకారంలో ఉండే సింబల్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే టెరైన్, శాటిలైట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో స్ట్రీట్ వ్యూ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.

అదే కంప్యూటర్‌లో అయితే.. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎడమవైపు కింది భాగంలో లేయర్స్ (Layers) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, స్ట్రీట్ వ్యూ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత మీరు వెతుకుతున్న అడ్రస్‌ను సెర్చ్ బార్ లో ఎంటర్ చేయాలి. లేదా గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు కావాల్సిన ప్రదేశం కోసం మౌస్ సాయంతో వెతకవచ్చు. ఒకవేళ అడ్రస్ సెర్చ్ బార్‌లో టైప్ చేస్తే.. ఆ ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్స్ మార్క్ చేసి చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి స్ట్రీట్ వ్యూ సాయంతో పరిసరాలను చూడొచ్చు. అంతేకాదు.. ఎక్క‌డో ఉండి.. ఆ వీధుల్లో వ‌ర్చువ‌ల్‌గా విహ‌రించ‌వ‌చ్చు కూడా.

First Published:  27 May 2023 2:26 AM GMT
Next Story