Telugu Global
National

దేశాన్ని విభజించే చర్యలు మానండి- మోడీకి గోద్రెజ్ చైర్మన్ హితవు

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్‌ కూడా పరోక్షంగా మోడీ ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాదిర్‌ వ్యాఖ్యానించారు.

దేశాన్ని విభజించే చర్యలు మానండి- మోడీకి గోద్రెజ్ చైర్మన్ హితవు
X

వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సాధారణంగా ప్రభుత్వాల పరిపాలన తీరుతెన్నులపై తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తీకరించేందుకు ఇష్టపడరు. తమ వ్యాపారాలకు ప్రభుత్వాల నుంచి లేనిపోని ఇబ్బందులు వస్తాయన్న భావన అందుకు కారణం కావొచ్చు. కానీ దేశంలో పరిస్థితులు విపరీతం దిశగా వెళ్తున్నాయన్న భావనతో ఇటీవల వ్యాపారవేత్తలు కూడా జరుగుతున్న పరిణామాలపై రిస్క్ తీసుకుని తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు.

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్‌ కూడా పరోక్షంగా మోడీ ప్రభుత్వానికి హితవు పలికారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నాదిర్‌ వ్యాఖ్యానించారు. దేశాన్ని విభజించే ప్రయత్నాలను మానుకోవాలని పరోక్షంగా నరేంద్రమోడీ ప్రభుత్వానికి హితవు పలికారు.

ఐక్య భారత్‌కు కృషి చేయాలని అప్పుడే ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని గోద్రెజ్‌ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న విధానాన్ని గోద్రెజ్ తప్పుపట్టారు. దేశంలో భావప్రకటన స్వేచ్చ ఉండాలని తాను కోరుకుంటానని చెప్పారు. ప్రభుత్వాలను ప్రశ్నించే గొంతులను నొక్కకూడదన్నారు.

వ్యవస్థను బలహీన పరిచే చర్యలను తప్పుపట్టారాయన. వ్యవస్థను నిర్మించాలంటే చాలా కాలం పడుతుందని.. వాటిని నాశనం చేయడానికి చాలా తక్కువ సమయం చాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన వ్యవస్థల అవసరం దేశానికి ఉందన్నారు. అసమానతలకు దూరంగా, సమ న్యాయంతో కూడిన, ప్రతి ఒక్కరికీ ధీమాను ఇచ్చే కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని నాదిర్‌ గోద్రెజ్‌ ఆకాంక్షించారు.

ఉచిత పథకాల చర్చపై స్పందించిన నాదిర్‌... ఈ విషయంలో సమతులత్య ఉండాలన్నారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. కానీ ప్రభుత్వాలు విద్యా,వైద్యంపై తప్పకుండా ఖర్చు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

నాదిర్‌ గోద్రెజ్‌ సోదరుడు ఆది గోద్రెజ్‌ 2019లోనే ఈ తరహ హెచ్చరికలను చేశారు. దేశంలో అసహనం, విధ్వేషం పెరిగిపోతోందని ఇది ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం తెచ్చిపెడుతుందని హెచ్చరించిన ఉదంతం ఉంది.

First Published:  6 Sep 2022 3:05 AM GMT
Next Story