Telugu Global
National

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

తల్లిదండ్రుల అనుమతి లేకుండా ముస్లిం అమ్మాయిలు పెళ్ళి చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె మైనర్ అయినప్పటికీ ఆమె తన భర్తతో కలిసి జీవించవచ్చునని న్యాయమూర్తి జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు.

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
X

ముస్లిం అమ్మాయిల పెళ్లిపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం కీలక తీర్పునిచ్చింది. యుక్త వయస్సు వచ్చిన తరువాత ముస్లిం అమ్మాయిలు తమ తల్లిదండ్రుల అంగీకారం లేకుండానే తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చునని రూలింగ్ ఇచ్చింది. ముస్లిం చట్టాలు ఇందుకు అనుమతిస్తున్నట్టు స్పష్టం చేసింది. అమ్మాయి మైనర్ అయినప్పటికీ ఆమె తన భర్తతో కలిసి జీవించవచ్చునని న్యాయమూర్తి జస్టిస్ జస్మీత్ సింగ్ పేర్కొన్నారు. తమ‌ పేరెంట్స్ కి ఇష్టం లేకున్నా తాము వివాహం చేసుకున్నామని, కానీ దీన్ని వ్యతిరేకిస్తున్న తమ‌ తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఓ జంట ఢిల్లీ హైకోర్టుకెక్కింది. ఈ పిటిషన్ ని విచారించిన జస్టిస్ జస్మీత్ సింగ్.. వీరికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పంజాబ్, హర్యానా హైకోర్టు లోగడ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. సర్ దిన్షా ఫర్డుంజీ ముల్లా రాసిన 'ప్రిన్సిపల్స్ ఆఫ్ మహమ్మదన్ లా' అనే పుస్తకంలోని 195 వ ఆర్టికల్ ప్రకారం.. యుక్త వయస్సు వచ్చిన అమ్మాయి మైనర్ అయినప్పటికీ .. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చునని ఆ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.

బీహార్ కు చెందిన ఓ జంట కథనం ప్రకారం.. ముస్లిం చట్టాలు, సంప్రదాయం ప్రకారం తాము గత మార్చి 11 న మౌలానా సమక్షంలో పెళ్లి చేసుకున్నామని.. కానీ తమ తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఈ ప్రేమ జంట తమ పిటిషన్ లో తెలిపారు. తనను తన పేరెంట్స్ బలవంతంగా తన భర్త నుంచి విడదీసి ఇంటికి తీసుకువెళ్లి టార్చర్ పెట్టారని, తాము చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని వేధించారని ఈ కేసులో బాధితురాలు వెల్లడించింది. నేను మైనర్ నని.. అందువల్ల మీ వివాహం చెల్లదని నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుంచి కదలనివ్వలేదని ఆమె పేర్కొంది. అయితే అతి కష్టం మీద తాము బయటపడి కోర్టుకెక్కినట్టు ఈ జంట తెలిపింది. వీరి పిటిషన్ ను విచారించిన కోర్టు.. ముస్లిం చట్టాల ప్రకారం జరిగిన వీరి వివాహం చెల్లుతుందని, అమ్మాయి 15 ఏళ్ళ మైనర్ అయినప్పటికీ ఈమె తన భర్తతో కలిసి జీవించవచ్చునని తీర్పునిచ్చింది. పైగా ఈమె గర్భవతి అన్న విషయాన్నీ తాము పరిగణనలోకి తీసుకున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. వీరి భద్రత, రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను, పోలీసులను ఆదేశించారు.




First Published:  23 Aug 2022 2:08 PM GMT
Next Story