Telugu Global
National

తిరుగుబాటును సమర్దించుకునే ప్రయత్నం చేస్తున్న గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీ చేద్దామనుకున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పదవిలో సచిన్ పైలట్ ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. అయితే అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గెహ్లాట్ అనుచర ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు గెహ్లాట్ ఆ తిరుగుబాటును సమర్దించే ప్రయత్నం ప్రారంభించారు.

తిరుగుబాటును సమర్దించుకునే ప్రయత్నం చేస్తున్న గెహ్లాట్
X

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక సంద‌ర్భంగా రాజ‌స్థాన్ లో ఎమ్మెల్యేల తిరుగుబాటు వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని దిద్దుకునేందుకు ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. త‌న అభిమానులైన ఎమ్మెల్యేలు ప్ర‌ద‌ర్శించిన వ్య‌తిరేక‌త‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకుంటూ వారు అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో వివ‌రిస్తున్నారు. 2020లో రాష్ట్రంలో జరిగిన తిరుగుబాటు సమయంలో తన ప్రభుత్వాన్ని కాపాడిన 102 మంది ఎమ్మెల్యేలను వదులుకోలేనని అశోక్ గెహ్లాట్ ఆదివారంనాడు జైపూర్ లో మీడియాతో మాట్లాడుతూ స్ప‌ష్టంగా చెప్పారు. ఈ తిరుగుబాటుకు మూలం 2020 లో త‌మ‌ ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌ర్చాల‌నుకున్న వ‌ర్గానికి సీఎం పీఠం ద‌క్క‌కూడ‌ద‌నే ఉద్దేశ‌మేన‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నించారు.

గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, త‌ర్వాత స‌చిన్ పైల‌ట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భర్తీ చేయడంపై గెహ్లాట్ వ‌ర్గీయులు తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే.

త‌న‌పై 2020లో తిరుగుబాటు చేసిన శాసనసభ్యులపై తాజాగా ఎదురు దాడి చేశారు. వారు అప్పుడు బీజేపీతో చేతులు కలిపి పార్టీకి ప్ర‌భుత్వానికి న‌ష్టం చేయాల‌నుకున్నార‌ని ప‌రోక్షంగా స‌చిన్ పైల‌ట్ ను ప్ర‌స్తావిస్తూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. త‌న విధేయ ఎమ్మెల్యేలు అప్పుడు త‌న ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచార‌ని చెప్పారు. అందుకే ఇప్పుడు త‌మ విధేయ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించేందుకు ప్ర‌య‌త్నించారు.

"అప్ప‌ట్లో త‌మ‌ ఎమ్మెల్యేలు కొందరు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర నేతలను కలిశారు. అమిత్ షా వారికి స్వీట్లు అందించారు. అంటే దాదాపు ప్ర‌భుత్వాన్ని ప‌త‌నం అంచుల‌కు తీసుకెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన 102 మంది ఎమ్మెల్యేలను ఎలా మర్చిపోగలను'' అని ఆయన అన్నారు. "నాకు అవసరమైనప్పుడల్లా ప్రజల మద్దతు లభించింది, అది రాజకీయ సంక్షోభ సమయంలో అయినా కరోనా సమయంలో అయినా కావచ్చు. కాబట్టి, నేను వారి నుండి ఎలా దూరంగా ఉండగలను," అన్నారాయన. తాను సీఎం ప‌ద‌విని వ‌దుల‌కోలేక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు.

సచిన్ పైలట్ పేరు ఎత్త‌కుండానే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన‌వారిపై దర్యాప్తు చేయాలని గెహ్లాట్ సూచించాడు. రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి పేరుపై ఎమ్మెల్యేల్లో ఎందుకు ఆగ్రహం వచ్చిందో పరిశీలించాలని అన్నారు. సీఎం ప‌ద‌వికోసం యువ‌నేత తన ఆకాంక్షను స‌రైన ప‌ద్ధ‌తిలో వ్యక్తం చేయలేద‌ని గెహ్లాట్ న‌ర్మ‌గ‌ర్భ ఆరోపణలు చేశారు. "నేను జైసల్మేర్‌లో ఉన్నాను. నేను ఊహించలేకపోయాను, అయితే కొత్త ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారో ఎమ్మెల్యేలు పసిగట్టారు" అని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా లేదా అనే విష‌యం పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని గెహ్లాట్ అన్నారు. ప్ర‌స్తుతం త‌న‌ పని తాను చేసుకుపోతున్నానని, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే పార్టీ హైకమాండ్ తీసుకుంటుంద‌ని చెప్పారు. అయితే, ప్రజా సంకల్పం మేర‌కు తానే ముఖ్య‌మంత్రిగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

First Published:  2 Oct 2022 11:37 AM GMT
Next Story