Telugu Global
National

ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ

గౌతమ్ అదానీ నెలరోజుల్లో ఒక స్థానాన్ని అదిగమించి ప్రపంచ ధనికుల జాబితాలో మూడవ స్థానానికి చేరారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ తర్వాత స్థానం అదానీకి దక్కింది.

ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా గౌతమ్ అదానీ
X

ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ మూడ‌వ స్థానానికి ఎగబాకారు. గత నెలలో 4వ స్థానంలో ఉన్న అదానీ నెలరోజుల్లో ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచంలోని మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని రియల్ టైమ్ డేటా మంగళవారం వెల్లడించింది. ప్రపంచంలోని ముగ్గురు ధనవంతుల్లో ఆసియాకు చెందిన మొదటి వ్యక్తి అదానీ.

అదానీ నికర విలువ 137.4 బిలియన్ డాలర్లు (రూ. 10.9 లక్షల కోట్లు). బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మొత్తం సంపద పరంగా అతని కంటే ముందు స్థానాల్లో ఉన్న‌ ఇద్దరు వ్యక్తులు టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్.

60 ఏళ్ల అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ.. పోర్టులు, ఏరోస్పేస్, థర్మల్ ఎనర్జీ, బొగ్గు తదితర‌ కంపెనీలను నియంత్రిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన NDTVలో మెజారిటీ వాటాను తీసుకునేందుకు అదానీ గ్రూప్ చేస్తున్న‌ ప్రయత్నం కారణంగా అతను ఇటీవల ముఖ్యాంశాలలో ఉన్నాడు.

భారతదేశం యొక్క రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద $91.9 బిలియన్లు (రూ. 7.3 లక్షల కోట్లు).

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, గత నెలలో, అదానీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.

ఫిబ్రవరిలో, బ్లూమ్‌బెర్గ్ యొక్క బిలియనీర్స్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం, అదానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా అంబానీని అధిగమించాడు. ఆ సమయంలో అదానీ విలువ 88.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6.6 లక్షల కోట్లు).

అదానీ గ్రూప్ యొక్క ఏడు పబ్లిక్ ట్రేడ్ కంపెనీలైన‌ అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ మొత్తం మార్కెట్ విలువ మూడు సంవత్సరాలలో దాదాపు పది రెట్లు పెరిగి దాదాపు $237 బిలియన్లకు ( దాదాపు రూ. 18.9 లక్షల కోట్లు) చేరుకుందని రాయిటర్స్ నివేదించింది.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యొక్క డెట్-రీసెర్చ్ యూనిట్ అయిన 'క్రెడిట్ సైట్స్' ఆగస్టు 23న... అదానీ గ్రూప్ అనేక వ్యాపారాలలో దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నదని, పెట్టుబడుల కోసం అత్య‌ధిక రుణాల ద్వారా నిధులు సమాకూర్చుకుంటోందని పేర్కొంది. దీనివల్ల అదానీ గ్రూపు అప్పుల ఊబిలో పడి డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

First Published:  30 Aug 2022 11:18 AM GMT
Next Story