Telugu Global
National

వంటింట్లో మోదీ మంట.. దేశంలో 38శాతం మంది గ్యాస్ సిలిండర్లకు దూరం

వంట గ్యాస్ రేట్లు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రజలు భరించలేకపోతున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలపైనే వారు ఆధారపడ్డారు.

వంటింట్లో మోదీ మంట.. దేశంలో 38శాతం మంది గ్యాస్ సిలిండర్లకు దూరం
X

గ్రామీణ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పేరుతో ప్రతి ఇంటికీ సిలిండర్లను చేర్చిన ఘనత తమదేనంటూ కేంద్రం డబ్బా కొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. కానీ వాస్తవం అది కాదు. దేశంలో 38శాతం మంది ప్రజలు వంటకోసం గ్యాస్ వాడటంలేదు. కేవలం 62 శాతం మంది మాత్రమే గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇవి ప్రతిపక్షాలు విమర్శలకోసం సృష్టించిన గణాంకాలు కావు. కేంద్ర పర్యావరణ నివేదిక 2023 ప్రకారం బయటపడిన లెక్కలు. కేంద్రం పనితీరుని ఈ వివరాలు ఎండగడుతున్నాయి. భారత్ లో గ్యాస్ ధరల భగభగకు ఇవి అద్దంపడుతున్నాయి.

వంట గ్యాస్ నిత్యావసరంగా మారిన రోజులివి. పట్టణ ప్రాంతాల్లో వంటకోసం కచ్చితంగా గ్యాస్ వాడాల్సిందే. వారికి ప్రత్యామ్నాయం లేదు. గ్యాస్ సిలిండర్ రేటు భరించలేకున్నా కూడా కచ్చితంగా సిలిండర్ కొనాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిలిండర్ రేటు ఏడాదికేడాది భారీగా పెరిగిపోయింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడిన ఏడేళ్లలోనే గ్యాస్ సిలిండర్ రేటు రెట్టింపు అయింది. ఆ తర్వాత ఇప్పుడు పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతోంది. సబ్సిడీ అనేది వట్టి బూటకం అని తేలిపోయింది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగితే ఇక్కడ కూడా రేటు పెరగాల్సిందేనంటున్న మంత్రులు, అక్కడ రేటు తగ్గినప్పుడు మాత్రం ఆ లాభాలను జేబులో వేసుకున్నారు.

2014 తర్వాత 25కోట్ల భారతీయ కుటుంబాలు కొత్తగా గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ.. ఇంకా నూటికి 38శాతం మంది గ్యాస్ కి ఎందుకు దూరమయ్యారో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర పర్యావరణ గణాంకాల ప్రకారం.. దేశంలో 33.8 శాతం మంది వంటకోసం కట్టెలు, పొట్టు వంటివాటిపై ఆధారపడుతుండగా 2.2 శాతం మంది వంట కోసం పిడకలను వినియోగిస్తున్నారు. 1.3 శాతం మంది కిరోసిన్, గోబర్‌ గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్, బొగ్గుల పొయ్యిపై వంట చేస్తున్నారు.

చత్తీస్ ఘడ్ లో..

గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 49.4 శాతం మంది మాత్రమే వంటకోసం గ్యాస్ వాడుతున్నారు. మిగతావారంతా కట్టెలు, పొట్టు, పంట అవశేషాలు, పిడకలు, కిరోసిన్ స్టవ్, బొగ్గుల కుంపటిపై ఆధారపడుతున్నారు. ఛత్తీస్‌ ఘఢ్‌ గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 84.2 శాతం మంది వంట కోసం కట్టెలు, పొట్టు, పంట అవశేషాలపై ఆధారపడుతున్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ లో కూడా పరిస్థితి దుర్భరంగా ఉంది. వంట గ్యాస్ రేట్లు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణ ప్రజలు దాన్ని భరించలేకపోతున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలపైనే ఇంకా వారు ఆధారపడ్డారు.

First Published:  10 April 2023 1:32 AM GMT
Next Story