Telugu Global
National

ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.3వేలు..!

సిలిండర్ రేటుని తగ్గిస్తూ మోదీ.. ఇది రక్షాబంధన్ కానుక అని చెప్పడాన్ని కూడా అభిషేక్ బెనర్జీ తప్పుబట్టారు. అంటే ఐదేళ్లకోసారి మాత్రమే రక్షా బంధన్ వస్తుందా అని ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత రేటు తగ్గించడమేంటని నిలదీశారు.

ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.3వేలు..!
X

గ్యాస్ సిలిండర్ రేట్లు ఒకేసారి 200 రూపాయలు తగ్గించినా బీజేపీకి పెద్దగా మైలేజీ రాలేదు. పైగా ఇదంతా మోసం, దగా, ఎన్నికల జిమ్మిక్కు అంటూ విమర్శలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే సిలిండర్ రేటు 3వేల రూపాయలు దాటడం గ్యారెంటీ అంటూ కామెడీ చేస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని ధీమాగా చెబుతున్నారు ఎంపీ అభిషేక్.

రక్షాబంధన్ కానుకా..?

సిలిండర్ రేటుని తగ్గిస్తూ మోదీ.. ఇది రక్షాబంధన్ కానుక అని చెప్పడాన్ని కూడా అభిషేక్ బెనర్జీ తప్పుబట్టారు. అంటే ఐదేళ్లకోసారి మాత్రమే రక్షా బంధన్ వస్తుందా అని ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత రేటు తగ్గించడమేంటని నిలదీశారు. భారీగా పెంచడం, అందులో కొంత తగ్గించడం.. పక్కా వ్యాపార ధోరణి అంటూ మండిపడ్డారు.

పశ్చిమబెంగాల్ లో ధుప్ గురి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే బిష్ణుపాదరే మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. సెప్టెంబర్-5న ఉప ఎన్నిక జరుగుతుంది. ఈసారి అక్కడ బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఎంసీ నేతలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించడం మోదీ చీప్ ట్రిక్స్ గా అభివర్ణించారు.

ఆ డబ్బులేమయ్యాయి..

అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సిన వేళ, బీజేపీ తన సీటుని బెంగాల్ లో నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో బోల్తాపడితే బీజేపీకి కష్టకాలం మొదలైనట్టే చెప్పాలి.

First Published:  3 Sep 2023 11:18 AM GMT
Next Story