Telugu Global
National

వర్క్ ఫ్రమ్ హోమ్ బంపర్ ఆఫర్.. మోసపోవద్దు గురూ

వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు నెలకు 50వేలనుంచి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం అంటూ ప్రచారం చేస్తున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ బంపర్ ఆఫర్.. మోసపోవద్దు గురూ
X

సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్ బుక్ లో.. బంపర్ ఆఫర్ - వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. కరోనా కాలం తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ తో చాలామంది దారుణంగా మోసపోయారు, మోసపోతూనే ఉన్నారు. ఢిల్లీ కేంద్రంగా ఇలా 1700 మందిని మోసం చేసిన ఓ నకిలీ కాల్ సెంటర్ ముఠాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాత్, ఓం ప్రకాష్ అనే ఇద్దరు నిందితుల నుంచి 64వేల రూపాయల నగదు 14 సెల్ ఫోన్లు, మరో 13 సిమ్ కార్డ్ లు స్వాధీనం చేసుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా..

వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు నెలకు 50వేలనుంచి లక్ష రూపాయలు సంపాదించే అవకాశం అంటూ ప్రచారం చేస్తున్నారు. తీరా అందులో ప్రకటించిన నెంబర్లకు కాల్ చేస్తే మెల్లగా ముగ్గులోకి దింపుతారు. రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర ఫార్మాలిటీస్ అంటూ డబ్బు గుంజుతారు. ఆన్ లైన్ లో డబ్బులు తీసుకుంటారు. ఆ తర్వాత నెలరోజులపాటు ఏదో ఒక పనిచేయించుకుని, తీరా జీతం పడే సమయానికి ఫోన్ నెంబర్లు ఆపేస్తారు. ఇలా ఒకరిద్దరు కాదు మొత్తం 1700మందిని హర్యానా బ్యాచ్ మోసం చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నారు.

ఈ స్కామ్ కి సూత్రధారి.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఓ నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తుండటం విశేషం. ఈ కాల్ సెంటర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను కల్పిస్తామని ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి, చివరకు డబ్బులు కాజేసి నిరుద్యోగుల్ని నిండా మోసం చేస్తున్నాడు. ఫరీదాబాద్ కి చెందిన ఓ మహిళ, లక్షా 20వేల రూపాయలు మోసపోయింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరికోసం పోలీసులు గాలిస్తున్నారు.

First Published:  30 Dec 2022 10:39 AM GMT
Next Story