Telugu Global
National

కమలం గూటికి గాలి జనార్దన్ రెడ్డి

తాను ఎలాంటి షరతులూ లేకుండానే బీజేపీలో చేరానని, తనకు ఏ పదవులూ వద్దని గాలి జనార్దన్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని మోడీని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని ఆయన తెలిపారు.

కమలం గూటికి గాలి జనార్దన్ రెడ్డి
X

అక్రమాలకు పాల్పడిన కేసుల్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నవారు.. కోట్లాది రూపాయల అవకతవకలకు పాల్పడినవారు.. కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించినవారిని తమ పార్టీలో చేర్చుకుంటూ వారికి షెల్టర్‌ జోన్‌గా మారుతున్న బీజేపీ ఇప్పుడు మరోసారి అదేబాటలో నడిచింది. అక్రమ మైనింగ్‌ కేసుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన గాలి జనార్దన్‌రెడ్డిని తాజాగా తమ పార్టీలో చేర్చుకుంది.

అక్రమ గనుల తవ్వకాల కేసుల్లో అరెస్టయి.. బెయిల్‌పై వచ్చి.. రాజకీయాల్లో కొనసాగే ప్రయత్నం చేసినా.. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిన కర్ణాటక మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్‌రెడ్డి, ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు. తన పార్టీని కూడా బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులో సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప సమక్షంలో జనార్దన్‌రెడ్డి, ఆయన సతీమణి అరుణ లక్ష్మి కాషాయ కండువా వేసుకున్నారు.

తాను ఎలాంటి షరతులూ లేకుండానే బీజేపీలో చేరానని, తనకు ఏ పదవులూ వద్దని గాలి జనార్దన్‌రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ప్రధాని మోడీని మూడోసారి అధికారంలో నిలబెట్టేందుకు బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని ఆయన తెలిపారు. గాలి జనార్దన్‌రెడ్డి చేరికను యడియూరప్ప స్వాగతించారు. ఇది మంచి నిర్ణయమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో గాలి జనార్దన్‌రెడ్డికి టికెట్‌ దక్కే అవకాశాలు లేవు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన తన స్నేహితుడు బి.శ్రీరాములుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.

కర్నాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన గాలి జనార్దన్‌రెడ్డి అక్ర‌మ గనుల తవ్వకాలకు పాల్పడ్డారని 2011 సెప్టెంబరు 5న ఆయన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన ఇప్పటికీ బళ్లారి జిల్లాలోకి అడుగు పెట్టకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడం గమనార్హం. అయితే, బీజేపీలో ఆయన చేరికతో బళ్లారి, కొప్పళ జిల్లాల్లో పార్టీకి మరింత బలం వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

First Published:  25 March 2024 7:42 AM GMT
Next Story