Telugu Global
National

నెల రోజుల పోలీసుల వేట తర్వాత ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్ అరెస్ట్

అమృత్ పాల్ సింగ్ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన‌ అరెస్టు కావ‌డానికి ముందు మోగాస్ రోడ్ గ్రామంలోని గురుద్వారాలో ఒక సభలో ప్రసంగించిన వీడియో బైటికి వచ్చింది.

నెల రోజుల పోలీసుల వేట తర్వాత ఖలిస్తానీ నాయకుడు అమృతపాల్ సింగ్ అరెస్ట్
X

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పంజాబ్‌లోని మోగాస్ రోడ్ గ్రామం నుంచి ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

మోగా పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ, అమృతపాల్ సింగ్‌ను అస్సాంలోని దిబ్రూఘర్ జైలుకు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు, జాతీయ ఇంటెలిజెన్స్ సంయుక్త ప్రయత్నాల ద్వారా ఈ అరెస్టు జరిగింది.

అమృతపాల్ సింగ్ మరో ఇద్దరు అనుచరులను పంజాబ్‌లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

ఏప్రిల్ 15న, పంజాబ్ పోలీసులు అతని సన్నిహితుడు జోగా సింగ్‌ను ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ వద్ద‌ అరెస్టు చేశారు.

ఖలిస్థానీ అనుకూల నాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్‌కు మరో సన్నిహితుడిని ఏప్రిల్ 10న పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

దాదాపు నెల రోజుల క్రితం, పంజాబ్ పోలీసులు 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్ పై లుక్‌అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేశారు.

అమృత్‌పాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్‌సర్‌లోని అజ్నాలా పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, అతని సహాయకులలో ఒకరైన లవ్‌ప్రీత్ తూఫాన్‌ను విడుదల చేయించుకొని పోయిన తర్వాత, అంటే మార్చి 18 నుండి అమృత్‌పాల్ కోసం పంజాబ్ పోలీసులు భారీ వేట ప్రారంభించారు.

కాగా, అమృత్ పాల్ సింగ్ పోలీసులకు స్వయంగా లొంగిపోయాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన‌ అరెస్టు కావ‌డానికి ముందు మోగాస్ రోడ్ గ్రామంలోని గురుద్వారాలో ఒక సభలో ప్రసంగించిన వీడియో బైటికి వచ్చింది. అందులో ఆయన "నేను ఈ రోజు లొంగిపోతాను" అని పేర్కొన్నాడు.

First Published:  23 April 2023 3:54 AM GMT
Next Story