Telugu Global
National

మహిళా ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన విద్యార్థి అశుతోష్ శ్రీవాత్సవను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తన మార్కుల లిస్టును ఇవ్వకపోవడం వల్లే సహనం కోల్పోయి ప్రిన్సిపల్ పై దాడి చేసినట్టు వెల్లడించాడు.

మహిళా ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి
X

కాలేజీ ప్రిన్సిపాల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ విద్యార్థి . 54 ఏళ్ల మహిళా ప్రిన్సిపల్ 90 శాతం కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య ఉన్నారు. ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తుండగా దారి కాచి పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంతలో కాలేజి సిబ్బంది అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

ఇదే విద్యార్థి గతంలోనూ ప్రిన్సిపల్ పై ఒకసారి దాడికి ప్రయత్నించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా చిన్న విషయమే అంటూ గతంలో విద్యార్థికి వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఏకంగా ప్రిన్సిపల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. దాడి చేసిన విద్యార్థి అశుతోష్ శ్రీవాత్సవను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తన మార్కుల లిస్టును ఇవ్వకపోవడం వల్లే సహనం కోల్పోయి ప్రిన్సిపల్ పై దాడి చేసినట్టు వెల్లడించాడు.

దాడికి గురైన ప్రిన్సిపల్ విముక్తా శర్మ ప్రస్తుతం స్టేట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ప్రిన్సిపల్ ఇంటికి వెళ్తున్న సమయంలో విద్యార్థి పెట్రోల్ పోసి నిప్పంటించాడని దాంతో ఆమె కేకలు వేస్తూ కాలేజీ ప్రాంగణంలోనికి రాగా సిబ్బంది మంటలార్పి ఆసుపత్రికి తరలించారని ఎస్పీ వివరించారు. పెట్రోల్ చల్లి నిప్పంటించిన సమయంలో విద్యార్థి అశుతోష్ చేతులు, చాతికి నిప్పంటుకొని గాయాలయ్యాయి.

2022 జూలైలోనే పరీక్ష ఫలితాలు వచ్చినప్పటికీ తనకు మార్కుల జాబితాను మాత్రం ఇవ్వకుండా ప్రిన్సిపల్ వేధించారని విద్యార్థి ఆరోపిస్తున్నాడు. కాలేజీ సిబ్బంది మాత్రం సదరు విద్యార్థి ప్రవర్తన తొలి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. పలుమార్లు ప్రిన్సిపల్ తో గొడవపడ్డాడని, ఒక లెక్చరర్ ను కత్తితో పొడిచి గాయపరిచి ఆ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడని చెబుతున్నారు. శరీరంపై 90% కాలిన గాయాలు ఉన్నందున ప్రిన్సిపల్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఎలాంటి హామీ ఇవ్వలేమని వైద్యులు చెబుతున్నారు.

First Published:  21 Feb 2023 10:26 AM GMT
Next Story