Telugu Global
National

40 శాతం లంచాలిచ్చి ఎలా బ‌త‌కాలి మోదీగారు?

బీజేపీ పాలిత కర్నాటకలో 'కమీషన్‌ రాజ్‌' పేట్రేగిపోతోందని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని.. కర్నాటకను కాపాడేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు.

40 శాతం లంచాలిచ్చి ఎలా బ‌త‌కాలి మోదీగారు?
X

బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటకలో అవినీతి విశృంఖల రూపం దాల్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వాల్లోనూ కమీషన్లు, అవినీతి ఉండేది. కానీ ఆ కమీషన్లు 5 నుంచి 10 శాతం మధ్య ఉండేవి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 40 శాతం మేర కమీషన్లు దండుకుంటున్నారని... ఈ వ్యవహారంలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతల ప్రమేయం ఉందని కర్నాటక కాంట్రాకర్ల అసోసియేషన్ ప్రతినిధులు బహిరంగంగానే ఆరోపించారు. ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశారు.

అటు అసాధారణ స్థాయిలో లంచాలు ఇవ్వకుంటే కనీసం తమ స్కూళ్ల గుర్తింపును రెన్యువల్ కూడా చేయించుకోలేని పరిస్థితి ఏర్పడిందంటూ కొద్ది రోజుల క్రితమే ఏకంగా 13 వేల స్కూళ్ల ప్రతినిధులతో కూడిన రెండు అసోసియేషన్లు మోదీకి లేఖ రాశాయి. ప్రతి పనిలో 40 శాతం కమీషన్లు తీసుకుంటూ కర్నాటకకు 40 పర్సెంట్‌ స్టేట్‌గా పేరు తెచ్చార‌ని అందులో పేర్కొన్నారు.

కర్నాటకలో పెచ్చరిల్లిన అవినీతిపై ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌ టీవీ మోహన్‌దాస్ పాయ్‌ గళమెత్తారు. బీజేపీ పాలిత కర్నాటకలో 'కమీషన్‌ రాజ్‌' పేట్రేగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని.. కర్నాటకను కాపాడేందుకు చొరవ చూపాలని ప్రధానిని కోరారు. అభివృద్ధి పథంలో నడిచే, అవినీతిలేని రాష్ట్ర ప్రభుత్వం తమకు కావాలన్నారు. అవినీతిపరులైన రాజకీయ నాయకులను పక్కన పెట్టాలని కోరారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కర్నాటకలో పర్యటిస్తున్న సమయంలోనే మోహన్‌దాస్ పాయ్‌ ఈ అంశంపై మాట్లాడారు.

First Published:  3 Sep 2022 5:12 AM GMT
Next Story