Telugu Global
National

'కాగ‌డా గుర్తుతో 'ఉద్ధ‌వ్ సేన‌'కు పూర్వ వైభ‌వం'

ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలో ఉన్న శివసేనకు కాగడా గుర్తు రావడంతో రాబోయే రోజుల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఎన్ సీపీ నేత చగన్ భుజ్ బల్ అన్నారు. కాగ‌డా గుర్తుతో ఆ పార్టీకి గొప్ప అనుబంధం ఉందని ఆయన తెలిపారు.

కాగ‌డా గుర్తుతో ఉద్ధ‌వ్ సేన‌కు పూర్వ వైభ‌వం
X

శివ‌సేన ఉద్ధ‌వ్ బాలాసాహెబ్ పార్టీ పున‌రుజ్జీవం పొంద‌గ‌ల‌ద‌ని నేష‌న‌లిస్టు పార్టీ నేత‌, మాజీ శివ‌సేన నాయ‌కుడు ఛ‌గ‌న్ భుజ‌బ‌ల్ పేర్కొన్నారు. అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి 'మండుతున్న కాగ‌డా' గుర్తు రావ‌డంతోనే ఆ పార్టీ విజ‌య ఢంకా మోగించ‌డ‌మే గాక ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్ళి పున‌ర్వైభ‌వం వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. షిండే తిరుగుబాటుతో శివ‌సేన రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన విష‌యం తెలిసిందే. పార్టీ పేరు, చిహ్నం గురించి ఇటు ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద‌, అటు న్యాయ‌స్థానంలోనూ వివాదం న‌డుస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జ‌రుగుతున్నఉప ఎన్నిక‌, బిఎంసి ఎన్నిక‌ల‌కు సంబంధించి మండుతున్న కాగ‌డా గుర్తును ఈసీ కేటాయించింది. దీంతో ఉద్ధ‌వ్ వ‌ర్గం లో సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. కాగ‌డా గుర్తుతో ఆ పార్టీకి ఉన్నఅనుబంధం దృష్ట్యా ఆ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శివ‌సేన మాజీ నేత‌, ప్ర‌స్తుత‌ ఎన్సీపీ ఎమ్మెల్యే ఛ‌గ‌న్ భుజ‌బ‌ల్ మాట్లాడుతూ ఇక శివ‌సేన ఉద్ద‌వ్ బాలాసాహెబ్ కు తిరుగు లేద‌న్నారు. న‌ల‌భైమంది ఎమ్మెల్యేలు ఫిరాయించ‌డంతో పార్టీ ప‌ని ముగిసిపోయిన‌ట్టేన‌ని అంతా అనుకున్నారు. కానీ అది క్షేత్ర‌స్థాయిలో ప్ర‌స్తుతం గ్రామగ్రామాన అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కి చేరువైంది అన్నారు. ఎన్నిక‌ల సంఘం కాగ‌డా గుర్తును ఉద్ధ‌వ్ వ‌ర్గానికి కేట‌యించారు క‌నుక ఇక ఆయ‌న పార్టీని పున‌ర్నిర్మించడంతో పాటు పున‌రుత్తేజింప చేయ‌గ‌ల‌డ‌ని భుజ‌బ‌ల్ అన్నారు.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక‌లో ఉద్ధ‌వ్ ఠాక్రేకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి కాబ‌ట్టి ఈస్ట్ అంధేరీ సీటును గెలుపొంద‌డం ఏమంత క‌ష్టం కాబోదు అన్నారు.

మండుతున్న కాగ‌డా గుర్తు కు శివ‌సేన‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ గుర్తుపై చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు సాధించింద‌ని చెప్పారు. " 1985లో శివ‌సేన రాజ‌కీయ పార్టీగా న‌మోదు కాక ముందు కాగ‌డా గుర్తుపైనే తాను పోటీ చేసి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేన‌ని చెప్పారు. మ‌రాఠీ మ‌నూస్ కోసం పోరాడుతున్న రోజుల‌వి. అప్ప‌టికింకా పార్టీగా గుర్తింపు పొంద‌లేదు. స‌రైన చిహ్నం లేదు. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ మ‌ర‌ణించిన త‌ర్వాత మ‌హారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అప్పుడు శివ‌సేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే బాల్ బ్యాట్ గుర్తుపై ప‌లువురిని బ‌రిలో దింపారు. అయితే నేను మండుతున్న కాగ‌డా గుర్తును తీసుకున్నాను. ఎందుకంటే ప్ర‌చారంలో భాగంగా గోడ‌ల మీద రాసేందుకు కాగ‌డా తేలిగ్గా ఉంటుంది. వాస్త‌వానికి అప్పుడు పులి గుర్తును తీసుకోవాల‌నుకున్నాం కానీ ప్ర‌చారంలో గోడ‌ల మీద రాసేందుకు క‌ష్ట‌మ‌వుతుంద‌నే ఉద్దేశంతో మార్చుకున్నాం. పార్టీకి ప‌టిష్ట‌మైన నెట్ వ‌ర్క్ ఉన్నందున కాగ‌డాను విస్తృతంగా ఓట‌ర్ల‌లోకి తీసుకెళ్ళ‌గ‌లిగాము. ఓట‌ర్లు కూడా నాకు పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో కాగ‌డా గుర్తుపై మాజ్ గాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించాను.

ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన బిఎంసి ఎన్నికల్లో శివ‌సేన అభ్యర్థులంతా కాగ‌డా గుర్తువైపే మొగ్గు చూపారు. ఈ ఎన్నిక‌ల్లో నాతో స‌హా 70 మంది కార్పోరేట‌ర్లు గెలిచారు. బాలా సాహెబ్ న‌న్ను మేయ‌ర్ ని చేశారు. ఆ త‌ర్వాత 1989లో శివ‌సేన పార్టీగా రిజిస్ట‌ర్ అయిన త‌ర్వాత విల్లు-బాణం గుర్తు పొందింది. " అన్నారు భుజ‌బ‌ల్‌.

కొత్త గుర్తుపై రానున్న రోజుల్లో ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన ఉద్ద‌వ్ బాలా సాహెబ్ ఘ‌న విజ‌యాలు సాధించ‌గ‌లుగుతుంద‌ని ఆశా భావాన్ని వ్య‌క్తం చేశారు.

First Published:  12 Oct 2022 8:34 AM GMT
Next Story