Telugu Global
National

ఐఏఎస్, ఐపీఎస్ ల మెడపై కేంద్రం కత్తి..

రాజ్యాంగం చుట్టూ ఓ రక్షణ వలయంగా ఉండాల్సిన వ్యవస్థ, రాజకీయ మార్పుల వల్ల ప్రభావితం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి 82మంది మాజీ అధికారులు ఓ లేఖ రాశారు.

ఐఏఎస్, ఐపీఎస్ ల మెడపై కేంద్రం కత్తి..
X

వైరి వర్గాలు లొంగకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో అందరికీ తెలుసు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి కక్షసాధిస్తోంది, బలవంతంగా లొంగదీసుకుంటోంది. సరిగ్గా ఇప్పుడు కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులకు కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. ఐఏఎస్, ఐపీఎస్ లను కూడా కేంద్రం తమ చెప్పుచేతల్లో పెట్టుకోడానికి ప్రయత్నిస్తోంది. సివిల్ సర్వీసెస్ నియమ నిబంధనల్లో జోక్యం చేసుకుంటోంది. వారికి కేటాయించిన రాష్ట్రాలకు కాకుండా కేంద్రానికి విధేయత చూపించాలని ఆదేశాలిస్తోంది. మాట వినకపోతే క్రమశిక్షణ చర్యల పేరుతో వేధిస్తోంది. రాష్ట్రాల ప్రమేయం, అనుమతి లేకుండానే అధికారులను కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్లపై పంపించేందుకు నిబంధనలు సవరించాలనుకుంటోంది. ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలంటూ మాజీ అధికారులు ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఓ లేఖ రాశారు. 82మంది మాజీ అధికారులు రాసిన ఈ లేఖ ఇప్పుడు భారత రాజకీయాల్లో సంచలనంగా మారింది.

మా బాధలు చెప్పుకోవాలి..

ఐఏఎస్, ఐపీఎస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చే దిశగా కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని నిలువరించాలని, ఆమేరకు కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ రాష్ట్రపతిని లేఖలో కోరారు మాజీ అధికారులు. తమకు అపాయింట్ మెంట్ ఇప్పించాలని వేడుకున్నారు. తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా మాట్లాడటం లేదన్నారు. ప్రజాస్వామ్య విధానంలో సివిల్ సర్వెంట్ల హక్కులను కాలరాయడం, తద్వారా నిరంకుశ విధానాలను అమలు చేయడం వంటి వాటికి వ్యతిరేకంగా మాత్రమే తాము గళమెత్తామని చెప్పారు.

ఢిల్లీలో అధికారుల నియామకం, బదిలీలు.. ఇతర విషయాలపై కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని చూస్తున్న సందర్భంలో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు, విపక్షాల ఐక్యత కూడగడుతున్నారు. ఈదశలో మాజీ అధికారులు ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి లేఖ రాయడం సంచలనంగా మారింది.

భయం, పక్షపాతం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్న వ్యవస్థలుగా ఉన్న సివిల్ సర్వీసెస్ ని బలహీనపరచాలనుకోవడం, బలవంతం చేయాలనుకోవడం, తమకి అనుకూలంగా మార్చాలనుకోవడం సరికాదని అంటున్నారు మాజీ అధికారులు. కేంద్రంపై ప్రత్యేక విధేయత అనేది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో కొంతమంది అధికారులు కేంద్రంపై తమకి ఉన్న విధేయత చూపించుకోడానికి పోటీ పడుతున్నారని ఆరోపించారు. ప్రధానిని కీర్తిస్తూ ఇలాంటివారు భావి తరాలకు ఎలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు. లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తికి విరుద్ధంగా ఈ పరిణామాలు జరుగుతున్నాయని ఆ లేఖలో ప్రస్తావించారు. రాజ్యాంగం చుట్టూ ఓ రక్షణ వలయంగా ఉండాల్సిన వ్యవస్థ, రాజకీయ మార్పుల వల్ల ప్రభావితం అయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

First Published:  27 May 2023 5:30 AM GMT
Next Story