Telugu Global
National

దేశవ్యాప్తంగా శంకర్ దాదాలు.. నకిలీ డాక్టర్లపై సీబీఐ కేసులు

విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన కొంతమంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష పాసవకుండానే వైద్యులుగా రిజిస్ట్రేషన్ పొందుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు.

దేశవ్యాప్తంగా శంకర్ దాదాలు.. నకిలీ డాక్టర్లపై సీబీఐ కేసులు
X

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారంతా ఆ తర్వాత భారత వైద్య మండలి నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష పాసయితేనే భారత్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. అలా పాసైన వారికే రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిల్స్ లో సభ్యత్వం ఇస్తారు. నేరుగా ఫారిన్ లో ఎంబీబీఎస్ చదివి, ఇక్కడ ఆస్పత్రి ఓపెన్ చేస్తామంటే కుదరదు. ఇటీవల కొంతమంది విదేశాల్లో ఎంబీబీఎస్ చదివినవారు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష పాసవకుండానే వైద్యులుగా రిజిస్ట్రేషన్ పొందుతున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ఇలాంటి వారందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ భారీ కుట్ర బయటపడటంతో దేశవ్యాప్తంగా 91 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది.

ఎంబీబీఎస్ చదవకుండానే చాలామంది తప్పుడు సర్టిఫికెట్లతో డాక్టర్లుగా చలామణి అవుతున్న రోజులివి. విదేశాల్లో వైద్య విద్య అంటే అక్కడి యూనివర్శిటీ ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినలా లేక ఫేకా అని చూస్తారే కానీ, ఇక్కడ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయ్యారా లేదా, పాసయితే ఆ సర్టిఫికెట్ ఒరిజినలా కాదా అని పట్టించుకోవడం తక్కువ. అయితే ఈ ఎగ్జామ్ పాస్ కాకుండానే తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆ సర్టిఫికెట్ తో ఆస్పత్రులు ప్రారంభిస్తున్నారు, లేదా పేరున్న ఆస్పత్రుల్లో డాక్టర్లుగా చేరిపోతున్నారు. ఈ సర్టిఫికెట్ల స్కామ్ పై సీబీఐ దృష్టిసారించింది.

ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌ సర్, గురుదాస్‌ పూర్, భటిండా, సిమ్లా, జమ్మూ, శ్రీనగర్, డెహ్రాడూన్, ఘజియాబాద్, గౌహతి, ఇంఫాల్ సహా మొత్తం 91 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. సిక్కిం, రాజ్‌ పూర్, పాట్నా, ముంబై, జైపూర్, సికార్, విజయవాడ, వరంగల్, తిరునల్వేలి, మధురై, భోపాల్ లో ఉన్న మెడికల్ కౌన్సిల్స్ లో నకిలీ పాస్ సర్టిఫికెట్లను రికవరీ చేస్తున్నారు సీబీఐ అధికారులు. మెడికల్ కౌన్సిల్స్ వద్ద ఫారిన్ గ్రాడ్యుయేట్లు సమర్పించిన సర్టిఫికెట్లు నకిలీవని నిర్థారించారు. ఈ కేసులో పలువులు ప్రభుత్వ ఉద్యోగులపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 73 మంది ఇలా తప్పుడు సర్టిఫికెట్లతో డాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తేలింది.

విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడం వరకు ఓకే, ఆ సర్టిఫికెట్ వరకు ఒరిజినలే. కానీ అవి కూడా ఫీజు కట్టి తెచ్చుకున్న సర్టిఫికెట్లే కానీ, వారిలో పస లేదు. ఒకవేళ నిజంగానే వారు సమర్థులైతే భారత్ లో జరిగే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో పాస్ అవుతారు. అలా కానివారంతా ఫేక్ సర్టిఫికెట్లతో డాక్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు. ఈ శంకర్ దాదాలు, తప్పుడు వైద్యంతో రోగుల ప్రాణాలు తీస్తారనడంలో సందేహం లేదు. సీబీఐ కేసులతో తప్పుడు సర్టిఫికెట్ల బాగోతం ఇప్పుడు బయటపడింది.

First Published:  29 Dec 2022 1:16 PM GMT
Next Story