Telugu Global
National

2కోట్ల కేటాయింపుల్లో 12 లక్షలే ఖర్చు.. 135మంది ప్రాణాలు బలి

మోర్బీ వంతెన మరమ్మతు పనుల్లో మిగిలిన సొమ్ము కోటీ 88 లక్షల రూపాయలు. ఖర్చు పెట్టింది కేవలం 6శాతం మాత్రమే. మిగుల్చుకుంది 94శాతం.

2కోట్ల కేటాయింపుల్లో 12 లక్షలే ఖర్చు.. 135మంది ప్రాణాలు బలి
X

కర్నాటకలో కాంట్రాక్ట్ బిల్లుల్లో 40శాతం కమీషన్ ఇవ్వాలనే వార్తలు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 40 శాతం నాయకులకు కమీషన్ ఇచ్చి, మిగిలిన 60 శాతంలో కాంట్రాక్టర్ ఎంత మిగుల్చుకుంటే ఆ పనులు పూర్తవుతాయి. అంటే అవి ఎంత నాసిరకంగా ఉంటాయి. ఊహించుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది. బీజేపీ పాలనలోనే ఉన్న గుజరాత్ లో పరిస్థితి తలచుకుంటే కర్నాటకలో పరిస్థితి చాలా మేలు అనుకోవాల్సిందే. అవును, ఇటీవల మోర్బీ తీగల వంతెన కూలిన ఘటనలో దాని మరమ్మతులకోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు 2కోట్ల రూపాయలు. తీగలకు రంగులేసి, మార్బుల్స్ కి పాలిష్ పెట్టి అదనపు సోకులు చేసినందుకు కాంట్రాక్ట్ సంస్థకు అయిన ఖర్చు కేవలం 12 లక్షల రూపాయలు. అంటే మోర్బీ వంతెన మరమ్మతు పనుల్లో మిగిలిన సొమ్ము కోటీ 88 లక్షల రూపాయలు. ఖర్చు పెట్టింది కేవలం 6శాతం మాత్రమే. మిగుల్చుకుంది 94శాతం.

కాసులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీశారు..

రోడ్ కాంట్రాక్టర్లు, భోజనం కాంట్రాక్టర్లు కక్కుర్తి పడ్డారంటే దానివల్ల నష్టం జరిగినా.. అది పరిమిత స్థాయిలోనే ఉంటుంది. రోడ్డు దెబ్బతిన్నా, భోజనం నాసిరకంగా ఉన్నా ప్రత్యామ్నాయం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ తీగల వంతెన విషయంలో జరిగింది మరీ ఘోరం. 2కోట్ల రూపాయలకు బిల్లులు పెట్టుకుని కేవలం 12 లక్షలు ఖర్చు పెట్టారంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది ఆ అవినీతి సొమ్ముని పంచుకున్నారో ఊహించవచ్చు. ఆ పాపం ఖరీదు 135 ప్రాణాలు కావడం ఇక్కడ దారుణమైన విషయం.

దాదాపు 143 ఏళ్లనాటి సస్పెన్షన్‌ బ్రిడ్జి అది. ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, పర్యాటకుల కోసం తిరిగి తెరచుకోవచ్చని కాంట్రాక్ట్ పనులు తీసుకున్న ఒరేవా గ్రూప్‌ చైర్మన్‌ జైకుష్‌ పటేల్‌ అక్టోబర్ 24న ప్రకటించారు. ఎలాంటి భద్రతా పరమైన అనుమతులు లేకుండా నిర్వహణ సంస్థ పర్యాటకులను బ్రిడ్జిపైకి అనుమతించింది. అక్టోబర్ 30న తీగల వంతెన కుప్పకూలింది. 135 మంది చనిపోగా 100మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసు విచారణలో మాత్రం ఇప్పుడు విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల కమీషన్ల యావ.. ఇలా ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో గుజరాత్ లో బీజేపీ చిక్కుల్లో పడింది.

First Published:  5 Nov 2022 6:33 AM GMT
Next Story