Telugu Global
National

చరిత్రలో తొలిసారి.. సుప్రీంకోర్టు వాదనలు లైవ్ స్ట్రీమింగ్

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ఎన్వీ రమణ పదవీ కాలం ఈ రోజుతో ముగియనున్నది. తన చివరి పనిదినం నాడు ఎన్వీ రమణ కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

చరిత్రలో తొలిసారి.. సుప్రీంకోర్టు వాదనలు లైవ్ స్ట్రీమింగ్
X

కోర్టులో వాదనలు ఎలా జరుగుతాయి? జడ్జీలు విచారణ ఎలా చేస్తారు? అనే విషయాలు దేశంలోని చాలా మందికి తెలియదు. సినిమాల్లో చూపించే కోర్టు సీన్లే నిజంగా ఉంటాయని అనుకుంటారు. అయితే కోర్టులో విచారణ జరిగే సమయంలో ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకుంటారు. కనీసం ఫొటోలు కూడా తీసే వీలుండదు. అందుకే.. నిజమైన కోర్టులో ఏం జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్లకు తప్ప.. బయట ప్రజలకు తెలిసే వీలు లేదు. అయితే చరిత్రలో తొలిసారి కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఏ సెషన్స్ కోర్టులోనో.. జిల్లా కోర్టులోనే జరిగే వాదనలు కాదు. ఏకంగా సుప్రీంకోర్టులో ఇవ్వాళ (అగస్టు 26) జరుగనున్న ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) ఎన్వీ రమణ పదవీ కాలం ఈ రోజుతో ముగియనున్నది. తన చివరి పనిదినం నాడు ఎన్వీ రమణ కోర్టు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. తాను నేతృత్వం వహించనున్న బెంచ్‌కు సంబంధించిన కేసులను ఆయన స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. సుప్రీంకోర్టు సాంప్రదాయం ప్రకారం రిటైర్ అవబోతున్న సీజేఐ తన లాస్ట్ వర్కింగ్‌ డే రోజు కాబోయే సీజేఐతో బెంచ్ పంచుకుంటారు. ఈ క్రమంలో సీజేఐ ఎన్వీ రమణ, కాబోయే సీజేఐ యూయూ లలిత్‌తో పాటు జస్టిస్ హిమ కోహ్లీ బెంచ్‌లో ఉండనున్నారు. ఈ రోజు వీరి త్రిసభ్య ధర్మాసనం పలు కీలకమైన కేసుల్లో తీర్పు వెలువరచనున్నది.

2007లో గోరఖ్‌పూర్‌లో జరిగిన అల్లర్ల కేసులో సీఎం ఆదిత్యనాథ్‌ను విచారించడాన్ని యూపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అలహాబాద్ హైకోర్టు కూడా యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీన్ని సుప్రీంకోర్టులో చాలెంజ్ చేయగా.. దాన్ని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించనున్నది. ఈ కేసుతో పాటు రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలకు సంబంధించిన కేసుపై కూడా వాదనలు విననున్నది. కేరళ జర్నలిస్టు సిద్దీఖ్ కప్పన్ బెయిల్ పిటిషన్ వాదనలు కూడా లైవ్ స్ట్రీమ్ కాబోతున్నాయి.

కాగా సుప్రీం కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమ్ చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఈ-కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఈ-కమిటీ పనిచేస్తున్నది. దేశంలోని అత్యున్నత కోర్టుకు ప్రొసీడింగ్స్‌ను లైవ్ స్ట్రీమ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు సంబంధించి ఆయన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు కనుక విజయవంతం అయితే దేశ జ్యుడీషియరీ సిస్టమ్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటాయని పలువురు భావిస్తున్నారు. ఇవాళ లైవ్ స్ట్రీమ్ చేయడానికి సీజేఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే అని అంటున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ ఉంటుందని సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

First Published:  26 Aug 2022 6:27 AM GMT
Next Story